గెలిచిన కేసీఆర్: సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Jun 29, 2020, 11:02 AM IST
Highlights

 తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నాడు హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పును ఇచ్చింది.ప్రభుత్వ వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. సచివాలయం కూల్చివేయవద్దని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.

 తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నాడు హైకోర్టు ఈ మేరకు సంచలన తీర్పును ఇచ్చింది.ప్రభుత్వ వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. సచివాలయం కూల్చివేయవద్దని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.

సచివాలయ భవనాన్ని కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సహా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మరో  10 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు సుధీర్ఘంగా విచారణ జరిపింది. అన్ని వర్గాల వాదనలను హైకోర్టు వింది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును వెల్లడించింది.

సచివాలయంలో సరైన సదుపాయాలు లేవన్న ప్రభుత్వ లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సచివాలయంలోని భవనాలు శిథిలావస్థకు చేరుకొన్నాయని ప్రభుత్వం వాదించింది.  ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 

తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ సర్కార్ భావించింది. ఈ మేరకు  2019 జూన్ 27వ తేదీన కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

6 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. 9 మాసాల్లో భవనాన్ని పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ ప్లాన్ చేసింది. అయితే ఈ తరుణంలో సచివాలయాన్ని కూల్చివేయవద్దని కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఆవరణలో ఉన్న ఏపీ భవనాలను కూడ తెలంగాణకు అప్పగించడంతో  ఈ ప్రాంతంలో కూడ తెలంగాణకు అవసరమైన భవనాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది.

సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కూడ ప్రభుత్వం సిద్దం చేసింది. సచివాలయంలోని ప్రధాన కార్యాలయాలన్నీ ఆయా హెచ్ఓడీ కార్యాలయాలతో పాటు బూర్గుల రామకృష్ణారావు భవన్ కు తరలించిన విషయం తెలిసిందే.బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ప్రస్తుతం తెలంగాణ సచివాలయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

click me!