Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు

By telugu teamFirst Published Nov 8, 2021, 1:28 PM IST
Highlights

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై సుమారు 35 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ విచారించి హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. 

హైదరాబాద్: క్యూ న్యూస్(Q News) అధినేత Teenmar Mallanna అలియాస్ చింతపండు నవీన్‌కు తెలంగాణ హైకోర్టు Bail మంజూరు చేసింది. సుమారు రెండు నెలల పాటు ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 కేసులు ఆయనపై నమోదయ్యాయి. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తాజాగా, సోమవారం Telangana High Court బెయిల్ మంజూరు చేసింది.

అధికార పార్టీ TRS, KCR, కేటీఆర్, కవితక్కలపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఆయన జర్నలిజం పేరిట కొందరిపై బెదిరింపులకు పాల్పడ్డారని, అక్రమ వసూళ్లకూ యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. చిలకలగూడ జ్యోతిష్యుడి ఫిర్యాదు సహా పలువురి ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా తీన్మార్ మల్లన్నపై సుమారు 35 కేసులు నమోదయ్యాయి.

Also Read: కమల దళంలోకి తీన్మార్ మల్లన్న?.. కారణాలు ఇవేనా?

ఈ కేసులపై స్థానిక న్యాయస్థానాల్లో విచారణలు జరిగాయి. స్థానిక న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేయగానే మరో కేసు దాఖలవ్వడం ఇలా ఆయన జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని కేసుల నుంచి బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్న ఈ నెల 28న అరెస్టు అయ్యారు. 

కేసుపై కేసు నమోదవుతూ జైలుకే పరిమితం అయిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరే నిర్ణయం తీసుకున్నట్టు క్యూ న్యూస్ టీమ్ వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని ఆయన సతీమణి మాతమ్మ కూడా వెల్లడించారు. అంతేకాదు, అక్రమ కేసులపై జైలుపాలు చేస్తున్న తన భర్తను విడిపించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలకు ఆమె మెయిల్ పెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విధానాలపై ఆకర్షితుడై తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆయన టీం వెల్లడించింది.

Also Read: huzurabad Bypoll: టీఆర్ఎస్‌లోకి తీన్మార్ మల్లన్న హుజురాబాద్ కమిటీ సభ్యులు

అధికార పార్టీ నేతలపై తీన్మార్ మల్లన్న విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన విమర్శలపై విశేష స్పందన వచ్చింది. ఈ తరుణంలోనే తీన్మార్ మల్లన్నపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆయనకు అండగా నిలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ కుమార్ సహా పలువురు బీజేపీ నేతలు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తీన్మార్ మల్లన్న అరెస్టుకు ముందే ఆయన కార్యాలయంపై పోలీసులు పలుసార్లు దాడులు చేశారు. కార్యాలయంలోని హార్డ్ డిస్కులను తీసుకెళ్లారు. ఈ తనిఖీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలిచారు.

తీన్మార్ మల్లన్న బీజేపీలోకి చేరే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించిన తర్వాత ఆయన సతీమణి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తీన్మార్ మల్లన్న సతీమణి, ఆమె సోదరుడు, బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్‌లు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారని మాతమ్మ కేంద్ర మంత్రికి వివరించారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరో అక్రమ కేసు పెడుతున్నారని తెలిపారు.

click me!