తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఏపీ కేడర్ కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్ కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమేష్ కుమార్ తెంగాణ క్యాడర్ కేటాయిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది హైకోర్టు.
రాష్ట్ర విభజన సమయంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించారు. ఈ కేటాయింపులో సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అలాట్ చేసింది. అయితే తాను తెలగాణలోనే కొనసాగాలని భావించిన సోమేష్ కుమార్ ఈ విషయమై క్యాట్ లో సవాల్ చేశారు. క్యాట్ లో సోమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో సోమేష్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో 2017లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ వాదనలు విన్న తర్వాత సోమేష్ కుమార్ ను ఏపీకి వెళ్లాల్సిందేనని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ తీర్పును వెల్లడించింది. సోమేష్ కుమార్ కు కేటాయించిన తెలంగాణ కేడర్ ను రద్దు చేసింది హైకోర్టు .
తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సోమేష్ కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 2019 డిసెంబర్ నుండి ఆయన కొనసాగుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ ను ఏపీ కేడర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరగనుందోననే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియామకం సమయంలో ఇతరులు పోటీ పడినా కూడా సోమేష్ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. దీంతో ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఆనాడు అజయ్ మిశ్రా కూడ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పదవికి పోటీ పడ్డారు. అయితే అజయ్ మిశ్రా రిటైర్మెంట్ కు ఆరు మాసాలే గడువుంది. దీంతో సోమేష్ కుమార్ వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్టుగా అప్పట్లో ప్రచారం సాగిన విషయం తెలిసిందే.రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఉన్న ఎస్ కే జోషీ రిటైర్ కావడంతో సోమేష్ కుమార్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం