అనాథ పేరిట బీమా కట్టి.. ప్లాన్ ప్రకారం హత్య చేశారు.. కానీ చివరికి..

By team teluguFirst Published Jan 10, 2023, 10:28 AM IST
Highlights

గతేడాది జరిగిన ఓ హత్య కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. అనాథ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ కట్టి, ఆ డబ్బుల కోసం నిందితులు అతడిని హతమార్చారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. 

అతడో అనాథ. ఓ వ్యక్తి దగ్గర డ్రైవర్ గా చేరాడు. యజమానికి నమ్మకంగా ఉన్నాడు. కానీ చివరికి ఆ యజమానే అతడి పాలిట యముడిగా మారాడు. డ్రైవర్ పేరిట లోన్ తీసుకొని, బీమా కట్టి చివరికి అతడిని ప్లాన్ ప్రకారం హత్య చేశారు. ఆ బీమా డబ్బుల కోసం ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు. ఏడాది కిందట జరిగిన హత్య ఉదంతం తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లాలోని చెన్నారావుపేట మండల పరిధిలో ఉన్న బోడతాండా అనే గ్రామంలో బోడ శ్రీకాంత్‌ అనే వ్యక్తి నివసించేవాడు. అతడి వద్ద హైదరాబాద్‌ శివారులో ఉన్న మేడిపల్లి ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల భిక్షపతి అనే అనాథ డ్రైవర్ గా పనికి కుదిరాడు. అతడి వద్ద నమ్మకంగా పని చేశాడు.

కొంత కాలం తరువాత శ్రీకాంత్ తన డ్రైవర్ అయిన భిక్షపతి పేరుపై రూ.50 లక్షలకు ఓ బ్యాంకులో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. తరువాత అదే బ్యాంకులో భిక్షపతి పేరు మీద రూ.52 లక్షల లోన్ తీసుకున్నాడు. దానితో ఓ ఇంటిని కొన్నాడు. అయితే ఈ లోన్ తీసుకునే సమయంలో భిక్షపతి నామినిగా తన పేరును శ్రీకాంత్ చేర్చుకున్నారు. తరువాత అతడిని చంపేందుకు ప్లాన్ చేశాడు. ఈ హత్యలో మరి కొందరిని భాగస్వాములుగా చేసుకున్నాడు. హెడ్‌కానిస్టేబుల్‌ మోతీలాల్‌, సతీష్‌, సమ్మన్న అనే వ్యక్తులకు డబ్బులు ఇస్తానని ఆశ చూపించాడు. హత్య పథకంలో భాగస్వాములు కావాలని కోరాడు. దీనికి వారికి అంగీకరించారు.

హెడ్‌కానిస్టేబుల్‌ వేసిన ప్లాన్ లో భాగంగా 2021 డిసెంబరు 22న డ్రైవర్ భిక్షపతిని రాత్రి కారులో ఎక్కించారు. అతడితో ఫుల్లుగా మద్యం తాగించారు. అర్ధరాత్రి సమయంలో షాద్ నగర్ కు వచ్చారు. అక్కడి నుంచి మొగలిగిద్దవైపు వెళ్లారు. గ్రామం చివరికి చేరుకున్న తరువాత భిక్షపతిపై దాడి చేసి చంపేశాడు. దాడి చేసేందుకు నిందితులు హాకీ స్టిక్ ను ఉపయోగించారు. తరువాత రోడ్డుపై పడుకోబెట్టి రెండు సార్లు కారు నడిపారు.

ఈ ఘటనపై సమాచారం అందడంతో మరుసటి రోజు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముందుగా దీనిని అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు అధారంగా అది హత్య అని తేల్చారు. ఇదే సమయంలో భిక్షపతి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నిందితులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే భిక్షపతి అనాథ అని గుర్తించిన పోలీసులు ఇన్సూరెన్స్ మనీ కోసం ట్రై చేస్తున్న వ్యక్తికి ఎలాంటి రిలేషన్ షిప్ లేదని తెలిసింది. దీంతో వారికి అనుమానం వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ దర్యాప్తులో నిందితుల ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. దీంతో ఆధారాలు సేకరించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కు తీసుకెళ్లారు. అయితే గతంలో కూడా శ్రీకాంత్ పై నాచారం పోలీసు స్టేషన్ లో కేసు నమోదై ఉందని పోలీసులు పేర్కొన్నారు. జాబ్స్ ఇప్పిస్తానని కొందరు యువకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకున్నాడని, వారి అకౌంట్ లో నుంచి డబ్బులు డ్రా చేశాడని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. 

click me!