చెన్నమనేని పౌరసత్వ వివాదం: ఫిజికల్‌గా వాదిస్తామన్న రమేశ్ తరపు న్యాయవాది.. విచారణ మళ్లీ వాయిదా

By Siva KodatiFirst Published Jul 27, 2021, 3:02 PM IST
Highlights

ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై విచారణను తెలంగాణ హైకోర్టు ఆగస్టు 10కి వాయిదా వేసింది. జర్మనీ పౌరసత్వం కలిగి వున్నట్లు కేంద్రం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై చెన్నమనేని రమేశ్ కౌంటర్ దాఖలు చేశారు

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే చెన్నమనేని.. జర్మనీ పౌరసత్వం కలిగి వున్నట్లు కేంద్రం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై చెన్నమనేని రమేశ్ కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ పిటిషన్‌లపై ఇరువర్గాల వాదనలను న్యాయస్థానం విన్నది. సెక్షన్ 5 (1) ఎఫ్ సిటిజన్ షిప్ యాక్ట్ 1955 ప్రకారం చెన్నమనేనికి భారత పౌరసత్వం పొందడానికి అర్హుడని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనడానికి పూర్తి అర్హత వుందని న్యాయవాది వివరించారు. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని ఆయన కోర్టుకు తెలిపారు.

Also Read:జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేశా.. హైకోర్టుకు తెలిపిన చెన్నమనేని రమేశ్

భారత పౌరుడిగా వుండి జర్మనీ వెళ్లి వచ్చాడని చెన్నమనేని తరపు న్యాయవాది వివరించారు. చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి వున్నారని ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికీ చెన్నమనేని జర్మనీలోనే వున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. అదే సమయంలో భారత ప్రభుత్వానికి ఓసీఐ కార్డ్ కోసం దరఖాస్తు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి వున్నారని కేంద్రం హోంశాఖ తెలిపిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం వర్చువల్ కోర్ట్ నడుస్తున్నందున ఫిజికల్ కోర్టులో పూర్తి వాదనలు వినిపిస్తామని చెన్నమనేని తరపు న్యాయవాది వెల్లడించారు . అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. 

click me!