దళిత బంధు ఓకే... సీఎం కేసీఆర్ పైనే మా అనుమానాలన్నీ: కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి

By Arun Kumar PFirst Published Jul 27, 2021, 2:09 PM IST
Highlights

దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న దళిత బంధు పథకాన్ని తాము స్వాగతిస్తున్నాం... కానీ మా అనుమానాలన్నీ సీఎం కేసీఆర్ పైనే అని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. 

హైదరాబాద్: దళితుల సంక్షేమం కోసం చేపట్టే ఏ పని అయిన కాంగ్రెస్ స్వాగతిస్తుందని... అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధుపై పలు అనుమానాలున్నాయని  కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి పేర్కొన్నారు. ఉపఎన్నిక జరగనున్న ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే ప్రస్తుతానికి దళిత బంధు అందిస్తామనడమే ఆ అనుమానాలకు కారణమన్నారు. ఒక్క హుజురాబాద్ లోనే కాకుండా రాష్ట్రమంతటా దళిత బంధు అమలు చేయాలని కోదండరెడ్డి సూచించారు. 

''ఈ బడ్జెట్ లో దళిత సంక్షేమానికి 21వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కుటుంబానికి 10లక్షల రూపాయలు కేటాయించాలంటే ఈ నిధులు సరిపోవు. కాబట్టి వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు చేసి ఆమోదం చేయాలి. ప్రగతి భవన్ లో కూర్చుని చేస్తే సరిపోదు'' అని అన్నారు. 

''గతంలో దళిత కుటుంబాలకు 3 ఎకరాలు ఇస్తామని అన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టారు... అసెంబ్లీ లో కూడా చెప్పారు. కానీ చేయలేదు. దళిత సాధికారత విషయంలో సీఎం కేసీఆర్  గొప్పగా చెబుతున్నారు. కానీ చేసిందేమీ లేదు'' అని అన్నారు. 

read more  దళిత మహిళా కౌన్సిలర్ పై కేసు... ఇదేనా దళిత సాధికరత?: కేసీఆర్ ను నిలదీసిన కోమటిరెడ్డి

''మాజీ ప్రదాని ఇందిరా గాంధీ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలు, దళితులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కేసీఆర్ గుంజుకొని పరిశ్రమలకు ఇస్తున్నారు. ఫార్మా సిటీ కోసం కేవలం ఒక్క గ్రామంలో  1026 ఎకరాల దళితుల భూమి గుంజుకున్నారు. కోకాపేట, కూకట్ పల్లి వంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములు గుంజుకొని ఎకరాకు 8లక్షల రూపాయలు ఇస్తున్నారు. కోట్ల రూపాయలు పలికే భూములకు కేవలం 8 లక్షల రూపాయలు ఇచ్చి దళితులకు మోసం చేశారు.'ప్రభుత్వం భూ సేకరణ చేసిన భూముల్లో 90 శాతం దళితుల భూములే'' అని కోదండ రెడ్డి ఆరోపించారు. 

''దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రదాని ఇందిరా గాంధీ గరిబీ హఠావో కార్యక్రమం చేపట్టి ఎన్నో అద్భుతమైన పనులు చేశారు. కమ్యూనిస్టులు కూడా ఆమెను అభినందించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ దళిత సాధికారత కోసం ఎంతో చేసింది... కానీ దళితుల భూములను గుంజుకుని సాధికారత అంటున్నారు. ఈ విషయాలపై కేసీఆర్, కేటీఆర్ లు సమాధానం చెప్పాలి'' అని కోదండ రెడ్డి డిమాండ్ చేశారు. 
 
 
 

click me!