పాదయాత్ర సందర్బంగా భద్రత విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
హైదరాబాద్: పాదయాత్ర సందర్భంగా భద్రత విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.హత్ సే హత్ సే జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గత నెల 6వ తేదీన పాదయాత్రను ప్రారంభించారు.ఈ పాదయాత్రకు అదనపు భద్రతను కల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు విచారణను ప్రారంభించింది.
రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్న జిల్లాల్లో భద్రతను కల్పిస్తున్న విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టిక తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు భద్రతను కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. డీజీపీ ఆదేశాల కాపీని కూడా కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది అందించారు. అయితే డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు భద్రత ఇస్తున్నారో లేదా చెప్పాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదిని ఆదేశించింది హైకోర్టు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
రాష్ట్రంలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 60 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. 60 రోజుల పాటు పాదయాత్ర సాగేలా రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ ను సిద్దం చేసుకున్నారు.
గత నెల 6వ తేదీన మేడారంలో రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. ఇవాళ నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించున్నారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాదయాత్ర చేయనున్నారు.