ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సీబీఐ విచారణపై ప్రభుత్వం తన వాదనలను విన్పించింది. రేపు కూడా ప్రభుత్వం తరపున దుశ్యంత్ ధవే వాదనలు విన్పించనున్నారు. సీబీఐ విచారణను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది.
హైదరాబాద్:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ప్రలోభాల ేకసులో తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్యంత్ ధవే వాదించారు. వర్చువల్ గా ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు విచారించింది. రేపు కూడా ఈ కేసు విచారణ జరగనుంది.
సీబీఐని బీజేపీ కంట్రోల్ చేసిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీపై ఆరోపణలున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండు దఫాలు బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. బీఆర్ఎస్ ను అనైతికంగా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ప్రభుత్వ న్యాయవాది ధవే హైకోర్టులో వాదనలు విన్పించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న పరిణామాల అంశాలపై వీడియో, ఆడియో రికార్డులను ఏసీపీ సీజ్ చేసిన విషయాన్ని ధవే హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతే కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించినట్టుగా చెప్పారు. అయితే ఎప్ఐఆర్ లో పేర్కొన్న అంశాలను కేసీఆర్ మీడియాలో ప్రస్తావించలేదని ధవే చెప్పారు . అంతేకాదు ఈ కేసులో బీజేపీపై కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని ధవే హైకోర్టుకు తెలిపారు. సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి నాలుగు రోజుల ముందే హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ధవే గుర్తు చేశారు.
undefined
ఈ కేసుపై రేపు కూడా తన వాదనలను విన్పించేందుకు అనుమతివ్వాలని ధవే కోరారు. తనకు జ్వరంగా ఉన్నందున తాను వాదనలు విన్పించే విషయమై అడ్వకేట్ జనరల్ ద్వారా రేపు 1 గంట వరకు సమాచారం ఇస్తానని ధవే చెప్పారు . ప్రభుత్వ వాదనల తర్వాత సీబీఐ హైకోర్టులో ఎలా వాదనలు విన్పిస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది.
2022 అక్టోబర్ 26న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ ముగ్గురు పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని అరెస్టయ్యారు. ఈ కేసులో ఈ ముగ్గురికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణకు కేసీఆర్ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణను బీజేపీ సహా మరో నలుగురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్ 26న సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసును సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ విషయమై ఇప్పటికే బీజేపీ తరపు వాదనలు హైకోర్టు విన్నది. ప్రస్తుతం ప్రభుత్వం తరపున వాదనలను హైకోర్టు వింటుంది.