వేట మొదలైంది.. పద్ధతి మార్చుకోండి: ప్రైవేట్ ఆసుపత్రులకు ఈటల వార్నింగ్

By Siva KodatiFirst Published Aug 4, 2020, 6:52 PM IST
Highlights

కరోనా వచ్చిన తొలినాళ్లలో తెలంగాణలో కేసులను వెంటాడి వేటాడి ట్రేస్ చేశామన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కోవిడ్‌పై మంగళవారం అధికారులతో సమీక్ష చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కరోనా వచ్చిన తొలినాళ్లలో తెలంగాణలో కేసులను వెంటాడి వేటాడి ట్రేస్ చేశామన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కోవిడ్‌పై మంగళవారం అధికారులతో సమీక్ష చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని.. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పీహెచ్‌సీలను సంప్రదించాలని మంత్రి సూచించారు. కరోనా కంటే భయంకరమైన వైరస్‌లు వచ్చాయన్నారు.

కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలని..అంతేకానీ ఇంట్లో కూర్చొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఈటల సూచించారు. పీహెచ్‌సీ స్థాయిలోనే కరోనా చికిత్స అందుబాటులో ఉందని.. అంతా కలిపితే వెయ్యి రూపాయలు కూడా దాటదని ఆయన తేల్చి చెప్పారు.

పది రోజుల పాటు ఒక పేషెంట్‌కు ఆక్సిజన్ పెడితే రూ.2,500 ఖర్చవుతుందని ఈటల చెప్పారు. గతంలో గాంధీ, చెస్ట్ ఆసుపత్రులలో మాత్రమే కరోనా చికిత్స ఇచ్చేవారమని.. ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో సైతం ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు రాజేందర్ వెల్లడించారు.

ప్రైవేట్ ఆసుపత్రులపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఈటల చెప్పారు. కరోనాను బిజినెస్‌లా చూడొద్దని కార్పోరేట్ ఆసుపత్రులకు సూచించామని రాజేందర్ పేర్కొన్నారు.

కానీ తాము చెప్పినట్లు కాకుండా కరోనాతో ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ ఇవ్వాలంటే లక్షల రూపాయలు కట్టాల్సిందేనని వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ ఆసుపత్రుల దందాపై నిపుణుల కమిటీ వేశామని.. పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

ఇప్పటికే ఒక ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ డాక్టర్లకు, మందులకు, ఆక్సిజన్లకు కొరత లేదని ఈటల స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 లక్షల టెస్టులు జరిగాయని.. ఒక్క ప్రాణం కూడా పోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. చర్యల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేయాలన్నది తమ ఉద్దేశ్యం కాదని.. ఉన్న సదుపాయాలని ప్రజలకు అందుబాటులో వుంచుతామని ఈటల చెప్పారు. 

click me!