మూడు ఎమ్మెల్సీ పదవులు: నాయినికి దక్కేనా?

By narsimha lodeFirst Published Aug 4, 2020, 5:18 PM IST
Highlights

ఎమ్మెల్సీ పదవుల కోసం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు  మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి  మరోసారి ఎమ్మెల్సీని పొడిగిస్తారా.... లేదా అనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది.


హైదరాబాద్: ఎమ్మెల్సీ పదవుల కోసం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు  మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి  మరోసారి ఎమ్మెల్సీని పొడిగిస్తారా.... లేదా అనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది.

తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి కేసీఆర్ వెన్నంటి నడిచిన నేతల్లో నాయిని నర్సింహ్మారెడ్డి ఒకరు. నాయిని నర్సింహ్మారెడ్డికి 2014లో ఏర్పాటైన కేసీఆర్ కేబినెట్ లో  హోంమంత్రిత్వ శాఖ దక్కింది. ఈ ఏడాది జూన్  19వ తేదీతో ఆయన పదవీ కాలం పూర్తైంది. అయితే మరోసారి నాయిని నర్సింహ్మారెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నేతలకు కూడ ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే అందరికి న్యాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు.

2018 ఎన్నికల సమయంలో ముషీరాబాద్ నుండి నాయిని నర్సింహ్మారెడ్డి తన అల్లుడికి టిక్కెట్టు ఇవ్వాలని కోరారు. తన అల్లుడికి కాకపోతే తనకైనా టిక్కెట్టు ఇవ్వాలన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ముఠా గోపాల్ కు టిక్కెట్టు ఇచ్చారు. టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరిన గోపాల్ కు టీఆర్ఎస్ టిక్కెట్టు ఇచ్చింది. ఈ సమయంలో నాయిని నర్సింహ్మారెడ్డి అల్లుడికి ఎమ్మెల్సీ టిక్కెట్టును, నాయినికి కేబినెట్ లో చోటును కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.రాములు నాయక్, నాయిని నర్సింహ్మరెడ్డి పదవులు ఖాళీ అయ్యాయి. ఈ నెలలో కర్నె ప్రభాకర్ పదవి కాలం కూడ పూర్తి కానుంది.2018 ఎన్నికల సమయంలో రాములు నాయక్ టీఆర్ఎస్ నుండి సస్పెండయ్యారు.ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

కర్నె ప్రభాకర్ కు మరోసారి అవకాశం దక్కనుందని కూడ ఇప్పటికే పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.  మిగిలిన రెండు స్థానాల్లో నాయిని నర్సింహ్మారెడ్డితో పాటు పలువురు మాజీ మంత్రుల పేర్లు కూడ పరిశీలనలో ఉన్నాయనే ప్రచారం కూడ సాగుతోంది.

నాయిని నర్సింహ్మారెడ్డికి ఆర్టీసీ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని ఇస్తామనే ప్రతిపాదన చేస్తే ఆయన తిరస్కరించినట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.తనకు ఇచ్చిన హామీని అమలు చేయాలని గతంలోనే అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా నాయిని నర్సింహ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ నాయిని నర్సింహ్మారెడ్డితో చర్చించారు.

అయితే తన అల్లుడికి కూడ ఎమ్మెల్సీ టిక్కెట్టును ఇస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని నర్సింహ్మారెడ్డి పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్టుగా సమాచారం. అయితే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, పీవీ నరసింహారావు కూతురు వాణి పేర్లు కూడ విన్పిస్తున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు కూడ తెరమీదికి వచ్చింది. కానీ మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం సూచనను పట్టించుకోకపోవడంతో జూపల్లి కృష్ణారావుపై పార్టీ నాయకత్వం కొంత గుర్రుగా ఉన్నట్టుగా కూడ మరికొందరు నేతలు చెబుతున్నారు.

click me!