పొంచి వున్న ప్రమాదం: రైతులకు మద్ధతు.. సాగు చట్టాలపై ఈటల కామెంట్స్

By Siva KodatiFirst Published Feb 4, 2021, 2:57 PM IST
Highlights

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలల నుంచి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న దీక్షకు మా మద్ధతు ఉంటుందన్నారు టీఆర్ఎస్ నేత, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలల నుంచి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న దీక్షకు మా మద్ధతు ఉంటుందన్నారు టీఆర్ఎస్ నేత, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

గురువారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర నిర్ణయాలతో కొంత ప్రమాదం పొంచి వుందని ఈటల ఆరోపించారు. ఎఫ్‌సీఐ ఆహార ధాన్యాలను కొనుగోలు చేయకపోతే ఇబ్బందులు వస్తాయని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర నిర్ణయం రైతులను మళ్లీ అభద్రతలోకి నెట్టేసిందని.. ఆయన మండిపడ్డారు. కాగా, సోమవారం రైతు సమస్యలపై మాట్లాడిన ఈటల.. తనకు కేసీఆర్‌పై అజమాయిషీ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో రైతు వేదికను ప్రారంభించిన ఈటల.. తనకు కేసీఆర్‌తో 20 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. సుదీర్ఘ అనుబంధం కారణంగా తనకు కేసీఆర్‌పై అజమాయిషీ ఉంటుందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఉన్నా లేకపోయినా.. నేను మంత్రిగా ఉన్న లేకపోయినా.. రైతులకు అండగా ఉంటామని మంత్రి ప్రకటించారు. రైతులు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఈటల. 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఆరేళ్ల కాలంలో కేసీఆర్ అనేక సార్లు సమావేశాలు నిర్వహించింది వ్యవసాయ రంగం మీద మాత్రమేనన్నారు. రైతులు ఏడిస్తే కేసీఆర్ తట్టుకోలేరన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉండాలనేది కేసీఆర్ కోరిక అని తెలిపారు.

click me!