లాక్ డౌన్ ఉల్లంఘించి, ఆపై ఆ ఫోటోలని ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి ఈటల!

By Sree sFirst Published May 11, 2020, 8:11 AM IST
Highlights

తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ ఈ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు. ఆయన ఇలా లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతా కూడా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ లాక్ డౌన్ వేళ ప్రభుత్వం అనేక విధివిధానాలను రూపొందించింది. ప్రజల కదలికలపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించింది. 

ప్రజలు ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే... పోలీసులు తమ స్టయిల్లో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. కానీ ఈ నిబంధనలను ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. 

ఇలా ప్రజాప్రతినిధులు ఉల్లంఘనకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు తప్ప, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు మాత్రం తాము చేసిన చట్టాలు ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి, తమకు మాత్రం వర్తించవు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. 

తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ ఈ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు. ఆయన ఇలా లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మంత్రిగారి ఇలా ఉల్లంఘనలకు పాల్పడి, ఆపై ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ గారు మరణించడంతో నిన్న ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఆ అంత్యక్రియలకు భారీస్థాయిలో జనాలు హాజరయ్యారు. మన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా హాజరయ్యారు. 

మాజీమంత్రి జువ్వాడిరత్నాకర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. pic.twitter.com/YgH6eioXvq

— Eatala Rajender (@Eatala_Rajender)

ఆయన ట్విట్టర్ వేదికగా "మాజీమంత్రి జువ్వాడిరత్నాకర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.." అని పోస్ట్ చేసి రెండు ఫోటోలను ఉంచారు. ఈ ఫొటోల్లో అక్కడ లాక్ డౌన్ నియమాల బహిరంగ ఉల్లంఘన కనబడింది. 

కేసీఆర్ చెప్పిన మాటల ప్రకారం అయితే... చావులకు 10 మంది పెళ్లిళ్లకు 20 మందికి మాత్రమే అనుమతి. అధికారిక మార్గదర్శకాల ప్రకారం అయితే.... చావులకు 20 మందికి మాత్రమే అనుమతి. అయినా ఇక్కడ ఇంతమంది పాల్గొనడంపై, అందునా కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్ గారే ఉండడం పై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. 

సామాన్య ప్రజలు చావులకు వెళితే... అక్కడ కరోనా వ్యాప్తిచెందుతుంది కానీ, ఇలా ప్రజాప్రతినిధులు వెళితే వ్యాప్తి చెందదా? దేశంలో ఈ కరోనా వైరస్ బారినపడ్డ ప్రజాప్రతినిధులు లేరా? వారిద్వారా వైరస్ వ్యాప్తి చెందలేదా?

ఇలా అక్కడ గనుక ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా కూడా అంతమందికి వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతమంది ప్రాణాలు కూడా రిస్కులో ఉన్నట్టే. అసలే తెలంగాణాలో టెస్టింగులు తక్కువగా చేస్తున్నారని స్వయంగా హై కోర్ట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో వీరికి వైరస్ సోకి, లక్షణాలు బయటపడకుండా ఉంటే... వారి ద్వారా ఎంతమందికి సోకే ప్రమాదం ఉంది?

దీనిపై రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అయితే... తెలంగాణ డీజీపీ ని ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా లాక్ డౌన్ ఉల్లంఘనల నేపథ్యంలో సామాన్య ప్రజలపై కఠినంగా వ్యవహరించే పోలీసులు, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి!

click me!