ఆరోగ్య రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.
హైదరాబాద్: ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.మంగళవారంనాడు తెలంగాణ సీఎం కేసీఆర్ 108 అంబులెన్స్ లు, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు.
కొత్తగా 466 వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని మంత్రి గుర్తు చేశారు.కానీ ప్రస్తుతం 75 వేల మందికి ఓ అంబులెన్స్ ను ఏర్పాటు చేశామన్నారు. అమ్మఒడి వాహనాలు కావాలని కోరగానే సీఎం నిధులు ఇచ్చారన్నారు.జననం నుండి మరణం వరకు వైద్య ఆరోగ్య సేవలు అందుతున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.
undefined
also read:హైద్రాబాద్‌లో 108, అమ్మఒడి వాహనాలు: ప్రారంభించిన సీఎం కేసీఆర్
వైద్య , ఆరోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను నీతి ఆయోగ్ అభినందించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. కరోనా కంటే పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొట్లాటలు, అవినీతి ఉందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు.
కుటుంబ పెద్దగా కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.ఈ నెల నుండి ఆశా వర్కర్ల ఫోన్ బిల్లులను ప్రభుత్వం చెల్లించనుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని మంత్రి తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో స్కామ్ లుంటే తెలంగాణలో స్కీమ్ లున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు 30 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో జరిగేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాల కారణంగా 70 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే సాగుతున్నాయన్నారు.. 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాల పెంచుతామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.