కులాంతర వివాహం చేసుకుంటే.. ఎస్సీలకు భారీ నగదు కానుక

By ramya neerukondaFirst Published Sep 24, 2018, 11:08 AM IST
Highlights

కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు రూ.50వేల నగదు ప్రోత్సాహం ఇస్తుండగా.. ఇప్పుడు దానిని రెండున్నర లక్షల రూపాలయకు పెంచనున్నట్లు తెలిపింది.
 

కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు భారీ నగదు కానుక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి వరకు కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు రూ.50వేల నగదు ప్రోత్సాహం ఇస్తుండగా.. ఇప్పుడు దానిని రెండున్నర లక్షల రూపాలయకు పెంచనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు ఇటీవలే సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కరుణాకర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల కులాంతర వివాహాలు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. 

సాంఘికసంక్షేమాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం 2015-16లో కులాంతర వివాహం చేసుకున్న దళితుల సంఖ్య 1959 కాగా, 2017-18 నాటికి వారి సంఖ్య 1090కి పడిపోయింది. 2018 సెప్టెంబరు 20 నాటికి 279 మంది కులాంతర వివాహం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కులాంతర వివాహాల ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య వరంగల్‌ అర్బన్‌, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది. నాలుగేళ్లలో వరంగల్‌ అర్బన్‌లో 710 మంది, నల్లగొండలో 594 మంది ఎస్సీలు కులాంతర వివాహ ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

హైదరాబాద్‌లో కేవలం 551మంది కులాంతర వివాహ ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోవడంతో వీటి ఆధారంగా ఎస్సీల కులాంతర వివాహం లెక్కలు వేయడం సమంజసం కాదనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 359 మంది, నిజామాబాద్‌లో 387 మంది,ఖమ్మంలో 378, కరీంనగర్‌లో 404 మంది కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహ ప్రోత్సాహకంగా కేంద్రం నుంచి 2.50 లక్షలు, రాష్ట్రం నుంచి రూ.50 వేలు మంజూరు చేస్తున్నారు.

 కేంద్ర ప్రోత్సాహకం పెద్దమొత్తమే ఉన్నా ఆఫీసుల చుట్టూ తిరగలేని వాళ్లు దరఖాస్తు చేసుకోవటం లేదు. దరఖాస్తు చేసుకున్న వారికి కేంద్రం నుంచి సాయం అంత తేలిగ్గా అందడం లేదు. దళిత యువతులు కులాంతర వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూ.50 వేలతో పాటు కల్యాణ లక్ష్మి ద్వారా మరో రూ.లక్ష కూడా తీసుకోవచ్చు. కులాంతర వివాహం కారణంగా తల్లిదండ్రులతో సత్సంబంధాలు లేక యువతులు కల్యాణ లక్ష్మి కింద లబ్ధి పొందలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

click me!