సారూ లెక్క చెప్పండి.. టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాల్సిందే: తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Jun 25, 2022, 6:02 PM IST
Highlights

విద్యా శాఖ పరిధిలో పనిచేసే టీచర్లు, ఉద్యోగులు ప్రతి యేటా ఆస్తులు వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వం (telagana govt) టీచర్లకు షాకిచ్చింది. విద్యాశాఖ (education department) పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్‌ జావేద్‌ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్‌బోర్డు సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. 

దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. జావేద్‌ అలీపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. అలాగే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్స్‌ చేసింది. అంతేకాదు. జావేద్‌ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు ఉండాలని .. ఉద్యోగులు ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు, స్థిర..చరాస్తి క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. ఈ సిఫారసులను పరిగణనలోనికి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  

click me!