TSPSC కార్యకలాపాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం లేదు: గంగుల కమలాకర్

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 8:17 PM IST
Highlights

Hyderabad: వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు తిరుపతిపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని  తెలంగాణ మంత్రి గంగుల‌ కమలాకర్ మండిప‌డ్డారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, నిరాధారమైన ఆరోపణలను ప్రజలు పట్టించుకోవద్దని పేర్కొన్నారు.
 

Telangana civil supplies minister Gangula Kamalakar: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్య‌వ‌హారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌తిప‌క్షాల‌తో పాటు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్య‌ర్థులు ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప‌రీక్ష‌ పేప‌ర్ల లీకేజీ వెనుక అధికార పార్టీ నేత‌ల హ‌స్తం ఉంద‌ని ఆరోపిస్తున్నాయి. అలాగే, సిట్ విచార‌ణ కాకుండా సీబీఐ కి విచార‌ణ అప్ప‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్షాల చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. 

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై గంగుల కమలాకర్ మండిపడ్డారు. TSPSC కార్యకలాపాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం లేదని వ్యాఖ్యానించారు. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు కీలక పాత్ర పోషించారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు తిరుపతిపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని గంగుల‌ కమలాకర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, నిరాధారమైన ఆరోపణలను ప్రజలు పట్టించుకోవద్దని కోరారు.

బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఇప్పటికే ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశామనీ, ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించామని గంగుల క‌మ‌లాక‌ర్ స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భాలను గుర్తు చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ మంత్రులెవరైనా రాజీనామా చేశారా లేక వారిని ఆయా ప్రభుత్వం తొలగించిందా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోశయ్య ప్రభుత్వ హయాంలో ఇదే తరహా పేపర్ లీకేజీ కేసులో ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్ రెడ్డి అరెస్టయ్యారనీ, కొన్నేళ్లుగా పలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పలు నియామక పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, నిరుద్యోగ యువత ఆకాంక్షలు ఛిన్నాభిన్నమయ్యాయని గుర్తు చేశారు.

అయితే రోశయ్య కానీ, అప్పటి ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కానీ రాజీనామా చేయలేదు. 2017లో కూడా ఏపీపీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో హైదరాబాద్ పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ కానీ, అప్పటి ఐటీ మంత్రి కానీ రాజీనామా చేయలేదంటూ వ్యాఖ్యానించారు.

click me!