ఇళ్లు లేని పేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సొంత స్థలం ఉంటే రూ. 3 లక్షల సాయం.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Feb 6, 2023, 3:08 PM IST
Highlights

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పేదలకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టుగా చెప్పారు. 

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పేదలకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టుగా చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 2వేల కుటుంబాల చొప్పున.. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ,38,000 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్టుగా చెప్పారు. వీరికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. సీఎం కోటాలో మరో 25వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. 

ఇక, ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్‌ బెడ్‌ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం రూ. 12,000 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. డబుల్ బెడ్‌ రూమ్ పథకం కింద.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 67,782 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా 32,218 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. 

ఇక, తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందని హరీష్ రావు అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి రాష్ట్రం చేరుకుందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం అని అన్నారు. సంక్షోభ స‌మ‌యాల్లో స‌మ‌ర్థ‌వంతంగా ఆర్థిక నిర్వ‌హ‌ణ‌తో తెలంగాణ మ‌న్న‌న‌లు పొందిందని తెలిపారు. 

కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రాస్ట్ర రుణపరిమితిని కేంద్రం అసంబద్దంగా తగ్గించిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం ఆంక్షలు పెడుతోందని విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టిందని ఆరోపించారు. 

దేశంలోని కొన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను అవహేళన చేస్తున్నాయని విమర్శించారు. ఉచితాలు అని అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిదానిని లాభానష్టాలతో చూసేందుకు పరిపాలన అనేది వ్యాపారం కాదని అన్నారు. సంక్షేమ పథకాలను మానవ అభివృద్ది దృక్పథంతో చూడాలని చెప్పారు.  

click me!