న్యాయ సమస్యల పేరుతో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కట్టే విషయం నుండి తప్పించుకోవద్దని తెలంగాణ గవర్నర్ తమిళిసై కోరారు.
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం అంశం కోర్టులో ఉందని ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విమర్శించారు.
సోమవారంనాడు ఉస్మానియా ఆసుపత్రిలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. పలు వార్డులను పరిశీలించారు. ఉస్మానియా వైద్యులతో మాట్లాడారు. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆసుపత్రి విషయమై
తనను ప్రశ్నించే బదులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు . తాను ఉస్మానియా ఆసుపత్రిని తనిఖీ చేయడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని గవర్నర్ తేల్చి చెప్పారు.
రాజకీయ నేతలు ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటారన్నారు. కానీ పేదలు ఎక్కడ చికిత్స చేసుకోవాలని గవర్నర్ ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రికి ఉన్న ఏడున్నర ఎకరాల ఖాళీ స్థలంలో కొత్త భవనం నిర్మించవచ్చు కదా అని ప్రభుత్వాన్ని గవర్నర్ అడిగారు. రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఉస్మానియా వైద్యులను గవర్నర్ అభినందించారు.
also read:ఉస్మానియా ఆసుపత్రిలో తమిళిసై ఆకస్మిక తనిఖీ: ప్రజా ప్రతినిధులతో హరీష్ రావు సమీక్ష
ఉస్మానియా ఆసుపత్రి విషయమై ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చుకోవాలని ఇటీవలనే ట్విట్టర్ వేదికగా తమిళిసై సౌందర రాజన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు. బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ది గవర్నర్ కు కన్పించడం లేదని ఆయన విమర్శించారు.