తెలంగాణాలో లక్ష ఉద్యోగాలు: గవర్నర్ హామీ

First Published Mar 10, 2017, 6:12 AM IST
Highlights

లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని గవర్నర్ నరసింహన్  ఈ రోజు తెలంగాణా నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే, గవర్నర్ మాటలన్నీ అబద్దాలని కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది

ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని గవర్నర్‌ తెలిపారు.

 

 అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆందోళన చెందుతున్న నిరుద్యోగ యువకులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.

 

ఇప్పటి వరకూ రాష్ట్రంలో 27,481 ఉద్యోగాలను భర్తీ చేశామని మరొక 24 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని అన్నారు. దీనితో పాటు త్వరలో 12వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గవర్నర్  అన్నారు.

 

సాధారణంగా గవర్నర్ ప్రకటనయినా నిజమవుతుందేమో చూడాలి.

 

అయితే,  గవర్నర్ చెప్పేవన్నీ అబద్ధాలని, వాస్తవానికి ఆయన ప్రసంగానికి పొంతన లేదని చెబుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభనుంచి వాకౌట్ చేసింది. గవర్నర్ చేత అబద్ధాలు పలికిస్తున్నారని తెలుగుదేశం  కూడా విమర్శించిది.

 

ఈ రోజు గవర్నర్ చెప్పిన మరిన్ని ముఖ్యమయిన విషయాలు :

 

*కేజీ నుంచి పీజీ ఉచిత విద్యకు సన్నాహాలు. మైనార్టీల కోసం 201 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ప్రతి అసెంబ్లి నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాల, ఎస్సీ ఉమెన్‌ కోసం 30 రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తాం.

 

*హైదరాబాద్‌ నగరాన్ని క్రైమ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం, స్మార్ట్‌ పోలీసింగ్‌లో భాగంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం చేపడుతాం.

 

*ముందస్తు అంచనా ప్రకారం జీఎస్డీపీ 13.7 శాతానికి పెరుగుతుందని అంచనా. సేవా రంగం 14.6 శాతం వృద్ధి సాధించిందన్నారు.

 

*వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి 17.2 శాతం ఉంది. తెలంగాణ ఏర్పడ్డ ఆరు నెలల్లోనే కరెంట్ కష్టాలు అధిగమించామని పేర్కొన్నారు.

 

*రాష్ట్రంలో విద్యుత్ కొరతలు లేకుండా చేశామని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. సాగుకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం.

 

*తొలిసారి బీడీ కార్మికులకు రూ. 1000 పెన్షను ఇస్తున్నామన్నారు. ఒంటరి మహిళలకు రూ. 1000 భృతి ఇవ్వబోతున్నామని చెప్పారు.

 

*పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 51 వేల ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. 

 

గవర్నర్‌ ప్రసంగం కొత్త సీసాలో పాతనీరులా ఉందని భారతీయ జనతా పార్టీ  విమర్శించింది. ఉద్యోగాల కల్పన లాంటి ప్రధాన సమస్యలపై సరైన వివరణ లేదని పార్టీ  సభ్యులు అసంతృప్తి వ్యక్తం  చేశారు. కేంద్రం నుంచి అందుతున్న నిధులు ఏవిధంగా ఖర్చు చేస్తున్నారో వివరణే లేదని వారు విమర్శించారు.

 

 

click me!