తెలంగాణ రేషన్ డీలర్లపై ఉక్కుపాదం

First Published Dec 1, 2017, 5:13 PM IST
Highlights
  • డీలర్ల సమ్మెపై సర్కారు ఆగ్రహం
  • పౌరసరఫరాల శాఖ నిర్ణయం
  • డీడీలు కట్టడానికి డీలర్లకు 2వ తేదీ తుది గడువు
  • సమ్మెలో పాల్గొంట్టున్న వారి జాబితా సేకరణ
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో పౌరసరఫరాల శాఖ

రేషన్‌ డీలర్ల సమ్మెను తెలంగాణ సర్కారు తీవ్రంగా పరిగణిస్తున్నది. సమ్మెలో ఉన్న డీలర్లను తొలగించి కొత్త వారిని రిక్రూట్ చేయాలని సర్కారు ఆలోచిస్తోంది. ఈ విషయమై సమ్మెకు దిగిన రేషన్ డీలర్లపై ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తమవుతోంది సర్కారు. డీడీలు కట్టకుండా రేషన్‌ సరుకులు పంపిణీ చేయని డీలర్లను తొలగించడానికి రంగం సిద్దం చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా డీలర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు సైతం జారీచేసింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు రేషన్‌ సరుకుల కోసం డీడీలు కట్టని డీలర్లకు శనివారం (2వ తేది) వరకు డీడీలు కట్టడానికి పౌరసరఫరాల శాఖ గడువు విధించింది. అప్పటికి కూడా దారికిరాని డీలర్లను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. 3వ తేదీ నుండి వారి స్థానంలో కొత్తవాళ్ల నియామక ప్రక్రియను చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌ కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు సూచించారు. డీడీలు కట్టకుండా సమ్మెలో పాల్గొంటున్న వారి వివరాలను, అలాగే డీడీలు కట్టి సరుకులు పంపిణీ చేయకుండా ఉన్న డీలర్ల జాబితాను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళ్తున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలకు వ్యూహరచన చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఎలాంటి ఆటంకాలు లేకుండా పేద ప్రజలకు సరుకులు పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

చర్చలకు పిలవండి : డీలర్ల సంఘం

తమను చర్చలకు పిలవాలని రేషన్ డీలర్ల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏకపక్షంగా రేషన్ డీలర్లను తొలగిస్తే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సర్కారు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలున్నాయని వాటిని పట్టించుకోకుండా సర్కారు వ్యవహరిస్తోందిన ఆరోపించారు.

click me!