తెలుగుతల్లికి తెలంగాణ తల్లికి తేడా తెలుసా ?

First Published Nov 30, 2017, 6:13 PM IST
Highlights
  • తెలుగు మహాసభల నేపథ్యంలో కొత్త గందరగోళం
  • ఇద్దరినీ కలిపేస్తున్న అధికార వర్గాలు
  • అయోమయంలో తెలుగు అభిమానులు

తెలుగు ప్రజలందరూ  జమానాలో ఎప్పుడో తెలుగుతల్లిని సృష్టించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు ఆమెను పూజిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కారణంగా తెలుగుతల్లిని తెలంగాణవాదులు తూలనాడారు. ఎవనికి పుట్టిన తెలుగుతల్లి, ఎక్కడి నుంచి వచ్చిన తెలుగు తల్లి అని స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి కేసిఆరే నాడు ఉద్యమ నేతగా పరుష వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజకీయాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక అంతటితో ఆగకుండా అప్పట్లో ఉద్యమ నేత కేసిఆర్ తెలంగాణ తల్లికి రూపం ఇచ్చారు. తెలుగు తల్లి అనగానే ఒక చేతిలో వరి కంకులు, ఇంకో చేతిలో పూర్ణ కుంభం పట్టుకుని ఉంటుంది. ఆమెకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలంగాణ తల్లి ఒకచేతిలో మొక్కజొన్న,జొన్న కంకులు పట్టుకుని ఉండగా ఇంకో చేతిలో బతుకమ్మ పట్టుకుని ఉంటుంది. ఇదంతా చరిత్ర.

ఇక వర్తమానంలోకి వద్దాం. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అట్టహాసంగా చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది. కోట్ల కొద్ది ధనం వెచ్చించి అంగరంగ వైభవంగా తెలుగు మహాసభలు జరిపించేందుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అందరికీ ఒక అనుమానం వస్తున్నది. తెలంగాణలో తెలుగు మహా సభలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు తెలుగు తల్లి ఫొటోలు వాడాలా? లేక తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టి చేస్తున్నది కాబట్టి తెలంగాణ తల్లి ఫొటోలు ప్రచారంలో వాడాలా అన్న సందిగ్థంలో పడ్డారు అధికారులు.

ఈ పరిస్థితుల్లో కొందరు అధికారులు ఏం చేశారంటే... తెలుగు తల్లి, తెలంగాణ తల్లి వివాదంలో మనమెందుకు ఇరుకుడు అనుకున్నరేమో? అందుకే ఇద్దరు అమ్మలను కలిపేశారు. ఫొటో ఏమో తెలంగాణ తల్లిది, పేరు మాత్రం తెలుగు తల్లిది రెండూ కలిపి  ఫ్లెక్సీలు కొట్టించారు. బేగంపేటలోని ప్రకాశ్ నగర్ పరిసరాల్లో మెట్రో పిల్లర్లకు తెలంగాణ తల్లి అలియాస్ తెలుగు తల్లిని కలుపుతూ తయారు చేసిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

తెలంగాణ వచ్చింది కాబట్టి తెలుగుతల్లికి, తెలంగాణ తల్లికి పెద్దగా తేడా ఏముందంటూ జనాలు నిట్టూరుస్తున్నారు. అవును లేండి. ఉద్యమకాలంలో ధ్వేషభావంతో ఉండొచ్చు కానీ... ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో ఆనాటి వాతావరణ పరిస్థితులు అవసరమా అంటున్నారు పాలక పెద్దలు.

click me!