Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో గృహలక్ష్మి పథకం రద్దు.. ప్రజాపాలనపై సంచలన ప్రకటన.. భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు,మైనర్ సోదరుడితో గర్భం దాల్చిన 12 ఏళ్ల చిన్నారి.. అబార్షన్ కు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరణ, సీఎం జగన్‌తో షర్మిల భేటీ, సీఎం జగన్ కు చంద్రబాబు కౌంటర్, ఓటుకు నోటు కేసు కొనసాగిస్తా.. రేవంత్ పై ఆర్కే సంచలన వ్యాఖ్యలు, రసవత్తరంగా సాగుతోన్న రెండో టెస్టు.. తొలి రోజే 23 వికెట్లు.., సైంధవ్ ట్రైలర్ విడుదల వంటి పలు వార్తల సమాహారం.
Today Top Stories: ప్రజాపాలనపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
Prajapalana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ వరకు జరిగే ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. జనం తాకిడితో ప్రజాపాలన కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.
undefined
ఈ నేపథ్యంలో ప్రజా పాలనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై ప్రజా పాలన కార్యక్రమాన్ని నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోని వారు తర్వాతి సదస్సుల్లో అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రజా పాలన కార్యక్రమ అమలుపై బుధవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. బుధవారం 23 మంది ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన అధికారులను రేవంత్ సర్కార్ మారుస్తూ వస్తోంది. బుధవారం 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ హయాంలో సీఎంవోలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సభర్వాల్ కూడా ఈ లిస్టులో వున్నారు. ఈమెకు రేవంత్ రెడ్డి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారోనని గత కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొనగా.. ఇవాళ్టీతో దానికి తెరపడింది. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్‌ను నియమించింది. అయితే గంటల వ్యవధిలోనే 23 మంది ఐపీఎస్‌లను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది.
గృహలక్ష్మి పథకం రద్దు..
రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఇళ్లనిర్మాణం కోసం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సొంత స్థలం కలిగిన పేదలకు ఇళ్ళు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం అర్హుల నుండి దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయితే ఈ పథకం అమలుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు రావడం, అందులో బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో గృహలక్ష్మి పథకం అమలుకు నొచుకోలేదు. ఈ క్రమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గృహలక్ష్మి ద్వారా కాకుండా కాంగ్రెస్ హామీల్లో భాగమైన అభయహస్తం ద్వారా పేదల ఇళ్లనిర్మాణానికి సాయం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ హామీల అమలుకు అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి అధికారిక జీవో కూడా జారీ చేసారు. ఇందులో ఇప్పటికే గృహలక్ష్మి కింద ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.
సీఎం జగన్‌తో షర్మిల భేటీ.. రాజారెడ్డి పెళ్లి పత్రిక అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో ఆమె సోదరి వై.ఎస్. షర్మిల బుధవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. తన కొడుకు వై.ఎస్. రాజారెడ్డి వివాహాన్ని పురస్కరించుకొని పెళ్లి ఆహ్వాన పత్రికను వై.ఎస్. షర్మిల తన సోదరుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అందించారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వై.ఎస్. షర్మిల జగన్ తో భేటీ అయ్యారు. వై.ఎస్. షర్మిలతో పాటు ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడ ఉన్నారు. తన కొడుకు వివాహన్ని పురస్కరించుకొని అందరికి ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి కదా అని ఆమె మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మీతో ఎవరెవరు చేరుతున్నారనే విషయమై ఆమె సమాధానం చెప్పలేదు. తనకు సమయం లేదు.. తనకు వెళ్లే అవకాశం ఇవ్వాలని ఆమె మీడియా ప్రతినిధులను కోరారు.
సీఎం జగన్ కు చంద్రబాబు కౌంటర్
కుటుంబాలను చీలుస్తాయని, రాజకీయాలు చేస్తాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఆరోపించారు. రానున్న రోజుల్లో కుటుంబాలను మరింత చీల్చే కార్యక్రమాలు జరుగుతాయని, కుట్రలు, కుతంత్రాలు పెరుగుతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తన ఇంట్లో తానే చిచ్చు పెట్టుకుని తమపై పడ్డాడేంటీ? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగనన్న వదిలిన బాణం అని చెబుతూ ఆమె రాష్ట్రమంతా తిరిగిందని, ఇప్పుడు రివర్స్‌లో తిరుగుతున్నదని ఎద్దేవా చేశారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని ఆయనే చూసుకోవాలని, ఆయన చూసుకోకుంటే దానితో తమకేమిటీ? సంబంధం అని నిలదీశారు. ఏదో ఒక రకంగా ఇతరులపై బురద జల్లేసి బతకటం ఒక రాజకీయమా? అంటూ ఫైర్ అయ్యారు. పింఛన్ల పెంపు కోసం పెట్టిన కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం సబబేనా? అంటూ ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసు కొనసాగిస్తా.. రేవంత్ పై ఆర్కే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు ప్రస్తావిస్తూ ఏ పార్టీ మారినా.. తప్పు తప్పే కదా అని అన్నారు. తన కేసు కొనసాగిస్తాననీ అన్నారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్న విషయం తెలిసిందే. వైఎస్ షర్మిలా రెడ్డి వెంట తాను ఉంటానని, ఆమెతోపాటే కాంగ్రెస్‌లోకి వెళ్లుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌లోకి వెళ్లుతున్న తొలి ఎమ్మెల్యేను తానేనని వివరించారు. తాజాగా, ఆయన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు చేసినా.. అది తప్పేనని ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసును కొనసాగిస్తానని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలలో నారా లోకేశ్‌ను ఓడించి మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే సీటు నుంచి ఆయనకు వైసీపీ టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ, మంగళగిరి వైసీపీ ఇంచార్జీగా బీసీ నాయకుడికి బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆర్కే ఎమ్మెల్యే పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.
పెరుగుతున్న కరోనా సబ్-వేరియంట్ JN.1 కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Covid 19: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా (Coronavirus), సబ్-వేరియంట్ JN.1 కేసుల్లో వేగంగా పెరుగుదల నమోదవుతోంది. బుధవారం (జనవరి 3) విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 602 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు మరణించారు. అదే సమయంలో JN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించి 511 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ‘జేఎన్.1’ ఉపరకం కేసులు ఇప్పటివరకు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బయటపడ్డాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. ఇందులో కర్ణాటకలో అత్యధికంగా 199 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కేరళలో 148, గోవా లో 47, గుజరాత్ లో 36, మహారాష్ట్ర లో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
మైనర్ సోదరుడితో గర్భం దాల్చిన 12 ఏళ్ల చిన్నారి.. అబార్షన్ కు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరణ...
మైనర్ సోదరుడితో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన 12 ఏళ్ల బాలిక విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఈ గర్భాన్ని వైద్యపరంగా తొలగించడానికి అనుమతినివ్వాలని పెట్టుకున్న పిటిషన్ కు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరించింది. బాలిక కడుపులో పిండం ఇప్పటికే 34 వారాలకు చేరుకుంది. పిండం పూర్తిగా అభివృద్ధి చెందిందని.. ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తి చేయాలనడం సరికాదనే కారణంతో అబార్ట్ చేయడానికి కోర్టు నిరాకరించింది. అలాగే తల్లి, బిడ్డకు ప్రమాదమని, బిడ్డ పుట్టడానికి అనుమతించవలసి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.
రసవత్తరంగా సాగుతోన్న రెండో టెస్టు.. తొలి రోజే 23 వికెట్లు..
IND vs SA: కేప్ టౌన్ వేదికగా జరుగుతోన్న దక్షిణాఫ్రికా, భారత్ (SAvsIND) రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలించడంతో తొలిరోజు ఇరు జట్లు ఒడిదుడుకులు ఎదురుకున్నాయి. దీని ఫలితంగా మొత్తం 23 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా విఫలమైంది. కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బంతితో అదరగొట్టి.. రోహిత్ సేనను కేవలం 153 పరుగులకే కట్టడి చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 98 పరుగుల ఆధిక్యంతో నిలిచింది.
సైంధవ్ ట్రైలర్ విడుదల
వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కింది సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల వెంకీ 75 ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. కాగా నేడు సైంధవ్ ట్రైలర్ విడుదల చేశారు. మూడున్నర నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. వెంకటేష్ ఓ ఏడేళ్ల పాప తండ్రిగా కనిపిస్తున్నాడు.
అరుదైన వ్యాధి బారిన పడిన ఆ పాపను కాపాడుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన మెడిసిన్ కావాలి. మిడిల్ క్లాస్ తండ్రి అంత డబ్బు ఎక్కడ నుండి తేగలడు? తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు? అనేది చిత్ర కథ. ఫ్యామిలీ ఎమోషన్స్, మాఫియా యాక్షన్ కలగలిపి సైంధవ్ తెరకెక్కింది. అసలు వెంకీ మాఫియాతో ఎందుకు పెట్టుకున్నాడు? అనే అంశం ఆసక్తి రేపుతోంది.