రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వెంటనే ఆర్ధిక సహాయం కూడా ప్రకటించారు.
కరీంనగర్: అకాల వర్షాలతో రాష్ట్రంలో 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని సీఎం కేసీఆర్ చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్ధిక సహాయం అందించనున్నట్టుగా సీఎం తెలిపారు. ఈ మేరకు జీవో కూడా జారీ చేశామన్నారు. ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తున్నామని సీఎం వివరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంట నష్టాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పంట నష్టపరిహరం విషయంలో కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామన్నారు. అకాల వర్షాల కారణంగా వందకు వంద శాతం రైతులు పంట నష్టపోయారని సీఎం చెప్పారు. రైతులు నిరాశకు గురికావద్దని పరిహరం ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు.వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థితి ముందుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేసీఆర్ వివరించారు. రైతుల్లో భరోసా నింపేందుకు తాము పర్యటిస్తున్నామన్నారు. గతంలో ఏనాడూ ఈ రకంగా పంట నష్టం జరగలేదని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 84 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని సీఎం చెప్పారు. కేంద్రానికి రైతు గోస పట్టదన్నారు. అందుకే రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని కేసీఆర్ ప్రకటించారు.
also read:పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు: కేంద్రంపై కేసీఆర్ ఫైర్
ఇవాళ నాలుగు జిల్లాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సీఎం పర్యటించారు. పంట నష్టపోయిన నాలుగు జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. తొలుత ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటించారు. ఖమ్మం తర్వాత మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. అక్కడి నుండి నేరుగా సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.