కోమటిరెడ్డి కేసులో ప్లేట్ ఫిరాయించిన సర్కారు

First Published Mar 20, 2018, 1:36 PM IST
Highlights
  • సభ్యత్వ  రద్దుపై తెలంగాణ సర్కారు కొత్త వాదన
  • స్వామిగౌడ్ కంటి దెబ్బ కారణం కాదట
  • కోర్టులో మరో వాదన తెరపైకి తెచ్చిన సర్కారు

 

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వంకటరెడ్డి, సంపత్ కుమార్ మీద సభ్యత్వ రద్దు వేటు పడింది. వాళ్లు హెడ్ ఫోన్స్ విసరడంతో శాసనమండలి ఛైర్మన్ కంటికి గాయమై మూడురోజులపాటు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు మైకులు విసిరి శాసనమండలి ఛైర్మన్ ను గాయపరచిన కారణంగా వారి సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు తీర్మానం పెట్టారు. సభ ఆమోదం పొందింది. అయితే కోమటిరెడ్డి, సంపత్ సస్పెన్షన్ పై ఇప్పటి వరకు సర్కారు ఇదే మాట చెబుతూ వస్తున్నది తెలంగాణ సర్కారు.

ఇక సర్కారు చేసిన సభ్యత్వ రద్దును వ్యతిరేకిస్తూ హైకోర్టు మెట్లెక్కారు ఇద్దరు ఎమ్మెల్యేలు. దీంతో హైకోర్టు స్పందించింది. సభ్యత్వ రద్దు విషయంలో ఎన్నికల కమిషన్ ఏరకమైన ముందడుగు వేయరాదని ఆదేశించింది. ఆరు వారాల పాటు స్టే విధించింది. అయితే ఈ సందర్భంగా ఈ కేసులో జరిగిన వాద ప్రతివాదాలు ఆశ్యర్యకరంగా ఉన్నాయి.

వింటే ఆశ్చర్యం కలగక మానదు. తెలంగాణ ప్రభుత్వం తరుపున వాదించిన అడ్వొకెట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి సరికొత్త వాదనలు న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. అసలు ఇద్దరు సభ్యుల సస్పెన్షన్ కు శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటి గాయం కారణం కానే కాదని వాదించారు. హెడ్ ఫోన్స్ విసిరి స్వామి గౌడ్ ను గాయపరిచారన్న కారణంతో వారి సభ్యత్వాలు రద్దు చేయలేదని సభలో అనుచిత ప్రవర్తన కారణంగానే వేటు వేయాల్సి వచ్చిందని వాదించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అనుచితంగా ప్రవర్తించి సభ మర్యాదను కాలరాసే ప్రయత్నం చేశారని అందుకే వేటు పడిందన్నారు.  ఈ నిర్ణయం స్పీకర్ ఒక్కరే తీసుకోలేదన్నారు. సభ నిర్ణయం అని ఎజి వివరణ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ ప్రసంగం సమయంలో అనుచితంగా ప్రవర్తించిన కారణంగానే సభ్యత్వం రద్దు చేశారని చెప్పారు. గవర్నర్ కు గురిచూసి కొట్టానని కోమటిరెడ్డి సమర్థించుకుంటున్నారని, ఆయనలో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడంలేదని ఎజి వాదించారు.

ఇంతకాలం స్వామి గౌడ్ కు గాయమైన కారణంగానే కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలు రద్దు అయ్యాయని చెబుతున్న సర్కారు కోర్టులో మాత్రం కొంత భిన్నమైన వాదనలు వినిపించారు. ఏది ఏమైనా ఆ ఇద్దరు సభ్యుల మీద పగపట్టి వేటు వేశారన్న ప్రచారం మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీలో చేరకపోవడంతోనే వేటు వేశారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తోంది. సర్కారు సభలో ఒకరీతిగా.. న్యాయస్థానంలో మరో రీతిగా సమాధానం చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ వాదనకు బలం చేకూరేలవిధంగా ఉందని చెబుతున్నారు. హైకోర్టులకు ఏవిధమైన వీడియో పుటేజి ఇస్తారు? ఒకవేళ అది ఇచ్చిన తర్వాత కేసు ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

click me!