అద్దెకు ప్రభుత్వ కార్యాలయాలు.. కేంద్రం దారిలో తెలంగాణ సర్కార్, ముందుగా వాటిపైనే ఫోకస్

By Siva KodatiFirst Published Sep 22, 2021, 3:46 PM IST
Highlights

నష్టాల్లో వున్న వాటిని వదిలించుకోవడంతో పాటు నిధుల  సమీకరణే లక్ష్యంగా  కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని వాటికి టూ లెట్ బోర్డులను  పెట్టింది. ఇదే తరహాలో తెలంగాణ సర్కార్ కూడా అడుగులు వేస్తోంది. 

నష్టాల్లో వున్న వాటిని వదిలించుకోవడంతో పాటు నిధుల  సమీకరణే లక్ష్యంగా  కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని వాటికి టూ లెట్ బోర్డులను  పెట్టింది. ఇదే తరహాలో తెలంగాణ సర్కార్ కూడా అడుగులు వేస్తోంది. ప్రధాన కూడళ్లలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనాలను అద్దెకు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున విశాలమైన భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ముందుగా అద్దెకు ఇవ్వనుంది. ఆఫీసులో ఎంతమంది పనిచేస్తున్నారు... నిత్యం జరిగే కార్యకలాపాలు ఏంటి? తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వెనుకవైపు కార్యాలయాలుగా నడపడంతోపాటు ముందు భాగాన్ని హోటళ్లు, హాస్టళ్లు, కంపెనీల ఆఫీసులకు అద్దెకు ఇవ్వనున్నది.

కొన్ని చోట్ల అద్దె భవనాల్లో కార్యాలయాలను నడుపుతున్న సర్కారు నెల నెలా కిరాయిలు కట్టేందుకు ఇబ్బందులు పడుతోంది. ఇతర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా నిర్వహణ ఖర్చును కొంత తగ్గించుకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా ఆఫీసుల్లో మెయింటెనెన్స్​ ఛార్జీలను ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే రెగ్యులర్​గా విడుదల చేసే సామాగ్రి కొనుగోలు నిధులకు సైతం బ్రేక్​ వేసింది. విద్యుత్‌ను వృథా చేస్తున్నారంటూ ప్రీపెయిడ్​ మీటర్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాల నిర్వహణకు నెలవారీ ఖర్చులు ఎక్కువవుతున్నట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వాటిని తగ్గించుకోవడం, అదనంగా ఆదాయం తెచ్చుకోవడంపై దృష్టిసారించినట్లుగా సమాచారం. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సోమాజిగూడ, ఖైరతాబాద్, నాంపల్లి వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను అద్దెకివ్వనున్నారు.

click me!