ఆ గుట్టు విప్పేందుకేనా కెసిఆర్ సర్కారు భూముల సర్వే ?

Published : Aug 07, 2017, 08:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఆ గుట్టు విప్పేందుకేనా కెసిఆర్ సర్కారు భూముల సర్వే ?

సారాంశం

రాష్ట్రంలో భూరికార్డుల సమూల ప్రక్షాళన సర్వే సెటిల్ మెంట్ కోసం స్పెషల్ డ్రైవ్ భూమి అమ్మకాలు కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరగాలి బ్యాంకు లావాదేవీలతరహాలో భూరికార్డుల నిర్వహణ  భూరికార్డులను ఆన్ లైన్ చేయాలి

కెసిఆర్ సర్కారు మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన తరహాలోనే భూముల సర్వే కార్యక్రమం చేపట్టబోతున్నది. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఎకరాకు నాలుగువేల చొప్పన సర్కారు చెల్లించబోతున్నది. దీనిపై రైతుల వివరాలు అందుబాటులో లేవని, అందుకోసమే భూ సర్వే జరగాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలోని భూ రికార్డులన్నీ ప్రక్షాళన చేయాలని, ఏ భూమి ఎవరి పేరు మీదున్నదనే విషయం నిగ్గు తేల్చి బహిరంగ పర్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.ఇందుకోసం రాష్ట్రం వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సర్వే సెటిల్ మెంట్ చేయాలని కోరారు. ఇకపై భూమి అమ్మకాలు, కొనుగోళ్లన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని చెప్పారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు, పహానీ పత్రాలు మరింత సరళంగా ఉండాలని, గందరగోళానికి దారి తీసే అంశాలకు తెరవేయాలని సిఎం సూచించారు. 

భూమి రికార్డుల ప్రక్షాళనకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిజాం కాలంలో 1936లో చేసిన బందోబస్తు తప్ప మళ్లీ భూమి రికార్డులన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమం జరగలేదు. దీనివల్ల అనేక ఇబ్బందులు, వివాదాలు తలెత్తుతున్నాయి. శాంతి భద్రతల సమస్యలకు కూడా భూ వివాదాలు కారణమవుతున్నాయి. ఈ భూ వివాదాలకు స్వస్తి చెప్పడానికి రాష్ట్రంలోని భూభాగాన్నంతా సర్వే చేయాలని నిర్ణయించారు.  దీనికోసం సర్వే ఆఫ్ ఇండియాతో పాటు దేశంలోని వివిధ సర్వే ఏజన్సీల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు.

‘‘వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరానికి 4వేల చొప్పున రెండు పంటలకు గాను 8వేల రూపాయలను పెట్టుబడిగా అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. కానీ వ్యవసాయాధికారులు నిర్వహించిన సర్వే లో వెల్లడయిన వివరాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలడం లేదు. వ్యవసాయ శాఖ ఓ గ్రామంలో 300 మంది రైతులున్నారని తేలిస్తే, రెవెన్యూ శాఖ రికార్డుల్లో 1100 మంది ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి ఎవరికి ఇవ్వాలనే సంశయం వస్తుంది. ఇదొక్కటే కాకుండా భూ రికార్డులు సరిగా లేకపోవడం వల్ల ఇంకా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 2.70 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో కూడా ఏ భూమి దేని కింద ఉంది అనే వివరాలు తయారు చేయాలి. ఇలా ఒక్కసారి ప్రక్షాళన చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయానికి 8వేల పెట్టుబడి పథకం సక్రమంగా అమలు కావడంతో పాటు వివాదాలకు కూడా తెరదింపినట్లవుతుంది. భవిష్యత్తులో కూడా వివాదాలను నివారించినట్లవుతుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులకు ఈ సర్వే పూర్తయ్యే వరకు మరో  పని అప్పగించేది లేదు. ప్రస్తుతం ఇస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాలు, పహాణీ పత్రాలు కూడా గందరగోళంగా ఉన్నాయి. అన్ని కాలమ్స్ అవసరం లేదు. సరళంగా ఉండాలి. ఒకసారి ప్రక్షాళన జరిగిన తర్వాత ఆ వివరాలన్నీ ఆన్ లైన్ లో పొందుపరచాలి. సర్వే పూర్తయిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ప్రతీ భూమికి ప్రత్యేక నెంబర్ కేటాయించాలి. అవసరమైతే భూములకు హద్దు రాళ్లు కూడా పాతాలి. గ్రామస్థాయిలో నిర్వహించే రికార్డుల్లో ఉన్న వివరాలే సిసిఎల్ఎ దగ్గర కూడా ఉండాలి. ఎక్కడ ఏ మార్పు జరిగినా ఆన్ లైన్లో నే అన్ని చోట్లా రికార్డులు మారాలి. బ్యాంకులో వేసిన డబ్బులు ఏ ఎటిఎంలో తీసుకున్నా వెంటనే మెసేజ్ రావడం, బ్యాంకు రికార్డుల్లో వివరాలు నమోదు కావడం, ఎస్ఎంఎస్ రావడం ఎలా జరుగుతుందో భూమి రికార్డుల నిర్వహణ కూడా అలాగే ఉండాలి. బ్యాంకులు అవలంభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి ఉపయోగించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా