
ప్రాజెక్టులపై జిఎస్టీ విషయంలో న్యాయ పోరాటం చేస్తానంటూ సిఎం కెసిఆర్ మాట్లాడడానికి కొంచెం ఇంగితం ఉండాలన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్. రాష్ట్రంలో కెసిఆర్ సర్కారు చేస్తున్న అక్రమాలపై కోర్టుకు వెళ్లిన వారిని సన్నాసులు, దద్దమ్మలు అని తిట్టిన కెసిఆర్ ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని న్యాయ పోరాటం చేస్తారని ప్రశ్నించారు. గతంలో ముస్లింలకు రిజర్వేషన్ల విషయంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానన్న కెసిఆర్ తెలంగాణలో మాత్రం ధర్నా చౌక్ ఎత్తేశారని ఆరోపించారు. కెసిఆర్ కు ఎన్డీఎతో ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో తెలంగాణ ప్రజలకు బహిర్గతం చేయాలి. జిఎస్టీ విషయంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ ఒకమాట, సిఎం ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు శ్రవన్.
జిఎస్టీ సమావేశాలకు ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పోవాల్సి ఉంటే కెసిఆర్ కొడుకు కెటిఆర్ ఎలా వెళ్తాడని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వం ఈటెల రాజేందర్ ను ఆత్మన్యూనతా భావానికి గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అయినా మీటింగ్ కు వెళ్లిన కెటిఆర్ జిఎస్టీ విషయంలో ఎందుకు నిరసన తెలపలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో పార్లమెంటులో పోరాటం చేయాల్సిన టిఆర్ఎస్ ఎంపీలు గుడ్డి గాడిద పండ్లు తోముతున్నారా అని ప్రశ్నించారు.
నేరెళ్ల బాధితులకు మంత్రి కెటిఆర్ బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే సిరిసిల్ల ఎస్పీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. లేకపోతే దళితులు తెలంగాణ సర్కారుకు కర్రు కాల్చి వాతలు పెడతారని హెచ్చరించారు.