కరోనా దెబ్బకు తెలంగాణలో పరీక్షలు రద్దు: ఫెయిలైనవారంతా పాస్

By narsimha lodeFirst Published Jul 9, 2020, 5:21 PM IST
Highlights

కరోనా నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులంతా పాస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
 


హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులంతా పాస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. విద్యార్థులకు మార్కుల మోమోలను ఈ నెల 31వ తేదీ తర్వాత సంబంధిత కాలేజీల్లో పొందవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మరోవైపు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ధరఖాస్తు చేసుకొన్న విద్యార్థుల ఫలితాలను పది రోజుల తర్వాత అందిస్తామని మంత్రి వివరించారు. 

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఈ ఏడాది జూన్ 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రాష్టం నుంచి మొత్తంగా 9,65,839 మంది పరీక్షలకు హాజరయ్యారు.

ఫస్టియర్ లో 60.01 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ లో 68.86 శాతం ఉత్తీర్ణులయ్యారు.  ఫస్టియర్ లో బాలికల ఉత్తీర్ణత 67.47శాతం, బాలుర ఉత్తీర్ణత 52.30 శాతం. సెకండియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 75.15, బాలుర ఉత్తీర్ణత శాతం 62.10 శాతంగా ఉంది.గత ఎడాదితో పోలిస్తే సెకండ్ ఇయర్ లో 18 శాతం ఉత్తీర్ణత పెరిగింది.

గత నెల 22వ తేదీ నుండి విద్యార్థులకు మోమోలను అందించారు. అయితే ఇంటర్ సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని తొలుత భావించారు.

ఇంటర్ బోర్డులో  పలువురు ఉద్యోగులకు కరోనా సోకింది. కీలకమైన ఉద్యోగులు కూడ కరోనా బారినపడ్డారు. మరోవైపు జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహిస్తే కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు భావించింది. దీంతో ఈ పరీక్షలను రద్దు చేసింది. సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులంతా  పాస్ అయినట్టుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది.

click me!