
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం చోటుచేసింది. ఆయన కుమార్తె మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. సారపాకలోని ఆమె నివాసంలో ఉరివేసుకుని బలవనర్మరణానికి పాల్పడింది. గురువారం తెల్లవారుజామన మహాలక్ష్మి గది తలుపులు తెరవకపోవడంతో.. కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా మహాలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే ఆమె మృతిచెందినట్టుగా వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె మరణవార్త తెలిసిన వెంటనే దమ్మపేట నివాసంలో ఉంటున్న వెంకటేశ్వర్లు సారపాక చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసిన కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక, మహాలక్ష్మి తాటి వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె. ఆమె ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అయితే మహాలక్ష్మీ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)