మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సర్కార్.. 30,453 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..?

Siva Kodati |  
Published : Mar 23, 2022, 09:42 PM IST
మాట నిలబెట్టుకున్న కేసీఆర్ సర్కార్.. 30,453 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..?

సారాంశం

ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీనిలో భాగంగా తొలి విడత కింద 30,453 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే మిగిలిన పోస్టులకు అనుమతులు రానున్నాయి. 

ఉద్యోగాల భర్తీకి (notifications for recruitment) సంబంధించి అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ (kcr) కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  దీనికి అనుగుణంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) , శ్రీనివాస్‌గౌడ్‌ (srinivas goud) సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (harish rao) నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం.. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ (somesh kumar) , ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో పలు దఫాలుగా చర్చించింది. దీనిలో భాగంగా తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసీఆర్ ప్రకటించిన మొత్తం 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ బుధవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఆర్ధిక శాఖ అనుమతించింది.  అలాగే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్‌- 42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121, వైద్యారోగ్యశాఖ పాలనాధికారులు -20, వాణిజ్య పన్నులశాఖలో 48, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ -38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చర్చించి మిగిలిన ఉద్యోగాలకు అనుమతి ఇవ్వనున్నారు.  

కాగా.. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తక్షణమే  80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 

ఇక, కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల ద్వారా ఏటా 7వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను ముందే గుర్తించి.. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పారదర్శకంగా ఉద్యోగుల భర్తీ చేపడతామని వెల్లడించారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది  దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమన్నారు. Hyderabad తొలుత ఒక దేశంగా, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఉందన్నారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉందన్నారు.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో తాను 9వ తరగతి విద్యార్ధిగా పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నానని కేసీఆర్ చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్ధిగా మీరు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష, అన్యాయాలతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైద‌రాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోట‌ళ్లు. అస‌లేంటీ లాజిక్
Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu