బీజేపీకి షాక్.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 23, 2022, 8:27 PM IST
Highlights

ప్రస్తుతం తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి రాజకీయ వాతావరణ వేడెక్కిన సంగతి తెలిసిందే. ఆ బిల్లును తీర్మానం  చేసి తాము కేంద్రానికి పంపామని తెలంగాణ అంటోంది. అయితే తమకు అందలేదని కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

మాజీ మంత్రి, బీజేపీ (bjp) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన రిజర్వేషన్ల (tribal reservation)పెంపు బిల్లు కేంద్రానికి పంపిన మాట వాస్తవమేనని... అయితే బిల్లు రాలేదని కేంద్రమంత్రి అంటున్నారని ఈటల వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ బీజేపీ మీద ఉన్న కోపాన్ని రైతుల మీద చూపెడుతున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరణకు డబ్బులన్ని కేంద్రమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీగా మాత్రమే పనిచేస్తుందని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం రంగంలో దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 

ధాన్యం సేకరణ (paddy procurement) అనేది దేశంలో కొత్తగా వచ్చింది కాదని దశాబ్దాలుగా కొనసాగుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాక పంట పెరిగిందని ఆయన చెప్పారు. ఫుడ్ కార్పొరేషన్ రెండు విధానాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రాజేందర్ తెలిపారు. డీసీపీ పద్ధతిని తెలంగాణ రాష్ట్రం ఎంచుకుని ధాన్యాన్ని ఇస్తుందని, ముందు చూపు లేక చిన్న చూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నం అవుతుందంటూ ఈటల చురకలు వేశారు. పార్టీ ఆఫీసుల మీద దాడులు, ధర్నాలు చేస్తారా? అంటూ ఆయన ఫైరయ్యారు.

Latest Videos

వడ్లు పండించి పార్టీ కార్యాలయం, ఇళ్ల ముందు పోస్తామని కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేయవద్దంటే.. రైతుల పరిస్థితి ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. కోటి ఎకరాల్లో పంట పండిస్తే కేసీఆర్ (kcr) ఎక్కడ అమ్ముకుంటాడని రాజేందర్ నిలదీశారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అంటివి ఏమైందని ఆయన మండిపడ్డారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ఎక్కడా చెప్పలేదని, ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తెలంగాణ బీజేపీ కృషి చేస్తోందని ఈటల చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రాజేందర్ పేర్కొన్నారు.

అంతకుముందు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతుందని టీఆర్‌ఎస్ ఎంపీలు ఆరోపించారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు (Bishweswar Tudu) అబద్దాలు ఆడి.. పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈ క్రమంలోనే బుధవారం కేంద్ర మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై  టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌స‌భ‌లో  ప్రివిలేజ్ నోటీసు (privilege motion) ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన బిశ్వేశ్వ‌ర్‌ను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌న్నారు.

అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్టాడారు. ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై 2017లోనే  తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం జరిగిందన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే కేంద్ర హోం శాఖకు పంపడం జరిగిందని తెలిపారు. తాము కేంద్రానికి పంపింది ప్రతిపాదన కాదని.. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లు అని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలిపారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. 

ఐదేళ్లుగా ఆ బిల్లు గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు.  తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం ఇప్పుడు కేంద్రం చెప్పడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీకి తెలంగాణపై చాలా అక్కసు ఉందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు.  ఎస్టీ రిజర్వేషన్‌లు సాధించే వరకు పోరాడతామని చెప్పారు.కేంద్ర మంత్రి ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పారని అన్నారు. కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు.  

click me!