
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) పార్టీ వీడుతున్నట్లు సోనియా గాంధీకి (sonia gandhi) లేఖ రాయడంపై టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. జగ్గారెడ్డి అంశాన్ని సానుకూలంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు టీపీసీసీ చీఫ్. ప్రజల సమస్యల ముందు .. తమ సమస్యలు చాలా చిన్నవని చెప్పారు. జగ్గారెడ్డి సమస్య టీ కప్పులో తుఫాను లాంటిదని రేవంత్ అన్నారు. కాంగ్రెస్‌లో వ్యక్తుల సమస్యలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌లో విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే వున్నాయని ఆయన స్పష్టం చేశారు. జగ్గారెడ్డి కోసం టీఆర్ఎస్ చేసే ఆలోచనలు అడియాశలవుతున్నాయన్నారు. కుటుంబం అన్నాకా భార్యాభర్తలు, అన్నాదమ్ముల మధ్య చిన్నచిన్న సమస్యలు వస్తాయని సమసిపోతూ వుంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీలో గతంలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉండేందని.. నరేంద్ర మోదీ (narendra modi) వచ్చిన తర్వాత ఏక వ్యక్తి పార్టీగా మారిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కూడా అలాగే ఉందని విమర్శించారు. ఏక వ్యక్తి ఆలోచన ఎప్పటికైనా ప్రమాదమేనని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ది భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని.. వాళ్లది ఏకత్వంలో మూర్ఖత్వం అని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో భిన్న అభిప్రాయాలను చర్చించుకుని.. ఏక నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. తమ అందరి నాయకురాలు సోనియా గాంధీ అని.. ఆమె మార్గదర్శకత్వంలో పనిచేస్తామని చెప్పారు. జగ్గారెడ్డి, రాఘవరెడ్డి, రాజేందర్.. ఇలా ప్రతి ఒక్కరి పార్టీ కోసం కష్టపడతరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు.
‘16,17 తేదీల్లో జరిగిన నిరసన కార్యక్రమాలల్లో అధికార పార్టీ ఎంత దారుణంగా ప్రవర్తించిందో అంతా చూశారు. నన్ను అరెస్ట్ చేయడం, కార్యకర్తలపై కొట్టడంతో.. కోపం, ఆవేశంతో కొంత పరుషమైన పదజాలం వాడాను. అయితే పరుషమైన పదజాలం పోలీసు అధికారులపై వాడకుండా ఉండివుంటే బాగుండేదేమోనని అనిపించింది. భవిష్యత్తులో అలాంటి పరుష పదజాలం వాడటం వీలైనంతా మేర తగ్గిస్తాం’ అని చెప్పారు. కుంభమేళా తరహాలో మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. సమ్మక్క- సారలమ్మ జాతర వైపు సీఎం కేసీఆర్ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలన్నారు.