ఎల్లుండి నుంచే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు: మంత్రి నిరంజన్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Jun 26, 2022, 4:42 PM IST
Highlights

ఖరీఫ్ సీజన్‌ రైతు బంధు నిధులను ఎల్లుండి(జూన్ 28) నుంచి రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్టుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతు బంధ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు రూ. 50,447.33 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా మంత్రి తెలిపారు.

ఖరీఫ్ సీజన్‌ రైతు బంధు నిధులను ఎల్లుండి(జూన్ 28) నుంచి రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్టుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతు బంధ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు రూ. 50,447.33 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా మంత్రి తెలిపారు. 28వ తేదీ నుండి రైతుల ఖాతాలలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు జమకానున్నాయని చెప్పారు. రైతు బీమా పథకం ద్వారా 83,118 మంది రైతు కుటుంబాలకు రూ. 4,150.90 కోట్ల పరిహారం అందజేసినట్టుగా చెప్పారు.

సీజన్‌కు ముందే రైతులు ఏ పంటలు వేయాలో సూచించడానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా 20 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపు కొనసాగుతున్నదని చెప్పారు.వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగుతో పాటు పప్పు, నూనెగింజల సాగుకు ప్రోత్సాహం. కందులు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పప్పుశెనగ, పొద్దుతిరుగుడు, మినుములు సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని తెలిపారు.

ఇక, ఇప్పటికే రైతు బంధు నిధుల విడుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. జూన్ 28 నుంచి రైతుబంధు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వానకాలం పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులను  రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. గతంలో మాదిరిగానే.. రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి దశలవారీగా రైతు బందు నిధులు జమ చేయనున్నారు. 

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కోసం మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో రైతు బంధు నిధులను డిపాజిట్ చేస్తుంది. కానీ ఈసారి అది ఆర్థిక సంక్షోభం కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.7,500 కోట్లు అవసరం. ఇందుకోసం జూన్ 7న రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రూ.4,000 కోట్లు అప్పుగా తీసుకుందని, జూన్ 28న మరో రూ.4,000 కోట్లు పొందే అవకాశం ఉంది. 
 

click me!