కొల్లాపూర్‌లో ఉద్రిక్తత: ధైర్యం లేకే ఎమ్మెల్యే హర్షవర్దన్ అరెస్ట్ చేయించుకున్నారు.. మాజీ మంత్రి జూపల్లి

By Sumanth KanukulaFirst Published Jun 26, 2022, 1:00 PM IST
Highlights

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమైన నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమైన నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే నేడు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జూపల్లి.. ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను సంపాదించిన పేరు, ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మంచి చేసి పేరు సంపాదించాలని.. కానీ చౌకబారు రాజకీయాలెందుకు అని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్దమా? అని ఎమ్మెల్యేకు సవాలు చేశానని గుర్తుచేశారు. ధైర్యముంటే అంబేడ్కర్ చౌరస్తాకు రమ్మని 15 రోజుల సమయమిచ్చానని చెప్పుకొచ్చారు. అయితే హర్షవర్దన్ రెడ్డి అంబేడ్కర్ చౌరస్తాలో కాకుండా తన ఇంటికొస్తాననని అన్నారని తెలిపారు. 

ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తున్నానని.. కానీ ఇప్పటివరకు రాలేదని జూపల్లి చెప్పారు.  తన వద్దకు వచ్చేందుకు ధైర్యం చాలక హర్షవర్దన్ రెడ్డి పోలీసుల చేత అరెస్ట్ చేయించుకున్నారు. అతని వర్గీయులకు మాత్రమే హర్షవర్దన్ రెడ్డి మేలు చేశారని విమర్శించారు. తనది మచ్చలేని చరిత్ర కాబట్టే.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. తాను ఏ బ్యాంకు నుంచి తీసుకన్న రుణం కూడా ఎగగొట్టలేదని చెప్పారు. తాను అప్పులు చేసి వ్యాపారం చేశానని.. తప్పులు చేయలేదని తెలిపారు. హర్షవర్దన్‌పై చేసిన ఆరోపణలను రుజువు చేస్తానని చెప్పారు. తాను చేసిన సవాలకు 100 శాతం కట్టుబడి ఉన్నట్టుగా వెల్లడించారు. 

కొల్లాపూర్‌లో టెన్షన్.. టెన్షన్..
ఇక, కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార టీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్ష‌వర్దన్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకొన్నాయి. అభివృద్దిపై తమ  చర్చకు అనుమతి ఇవ్వాలని ఇరువర్గాలు పోలీసులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ ఇరువర్గాలు.. ఆదివారం చర్చకు సిద్దమవ్వడంతో.. కొల్లాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో కొల్లాపూర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువురు నేతలను పోలీసులు తొలుత గృహ నిర్బంధం చేశారు. వారి ఇళ్లకు వెళ్లే మర్గాల్లో పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా ప్రధాన కూడలిలో పోలీసులు భారీగా మోహరించారు.

అయితే జూపల్లి ఇంటికి బయలుదేరారు. బారికేడ్లు తోసుకొని దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే‌కు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాను జూపల్లి ఇంటికి వెళ్తానని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి వర్గీయులు బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. 

click me!