తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి సంక్షేమానికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడాన్ని ఈసీ తప్పు పట్టింది.
ఢిల్లీ : కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను తెలంగాణ పత్రికల్లో ఇవ్వడంపై ఈసీ సీరియస్ అయింది. అక్కడ గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి తెలంగాణ పత్రికల్లో ఎన్నికల ప్రకటనలు ఇస్తోంది. దీన్ని వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ.. ఇప్పటికే ఇచ్చిన ప్రకటనలపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ పత్రికల్లో ఎన్నికల ప్రకటనలో ఇవ్వడంపై బిజెపి నాయకులు ఈసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం.
ఎన్నికలు జరగని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో.. తమ తమ రాష్ట్రాల్లోని సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రకటనలు ఇవ్వడం నిషేధమని ఎన్నికల సంఘం గతంలోనే పేర్కొంది. అలా ఇచ్చినట్లయితే వీటిని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద పరిగణిస్తామని తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి సంక్షేమానికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడాన్ని బిజెపి నాయకులు తప్పు పట్టారు.
undefined
ఈ మేరకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్, బిజెపి నాయకులు తరుణ్ ఛుగ్, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, సుధాంశు త్రివేణి, ఓం పాఠక్ లు సోమవారం ఈసీఐకి 7 పేజీల ఫిర్యాదును పంపించారు.కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర సీఎం, మంత్రులపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలిపారు.
దీనిమీద కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ స్పందించారు. కర్ణాటక సిఎస్ ను ఉద్దేశించి…ఎన్నికల నియమావళిని ఎందుకు ఉల్లంఘించారో మంగళవారం సాయంత్రం ఐదు గంటలలోపు సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. తెలంగాణలో అలాంటి ప్రకటనల ప్రచురణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఈ చర్యలపై ప్రభుత్వ సమాచార ప్రజా సంబంధాల విభాగం సెక్రటరీ ఇన్చార్జి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. ఎందుకు తీసుకోకూడదు వివరణ ఇవ్వాలని తెలిపారు.