
Telangana IT Minister and BRS working president KTR: కరీంనగర్ గడ్డమీదనే తెలంగాణ బీజం పడిందనీ, కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభమైందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. "అలుగనూర్ చౌరస్తాలో అరెస్టు కావడంతో అగ్గిరాజుకున్నదనీ, అది 2009 నవండర్ 29 అయితే, మళ్లీ ఈ సారి 14 ఏండ్ల తర్వాత 2023 నవంబర్ 30న మళ్లీ అగ్గిపెట్టాలే.. ఆ అగ్గిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దహించుకుపోవాలే.. కొట్టుకుపోవాలే.." అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, గత తొమ్మిదిన్నర ఏండ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ది జరిగిందని తెలిపారు.
కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ది, మార్పులను గమనించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలనీ, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతుగా ఉండాలని కోరారు. కరీంనగర్ లో ఎంతో అభివృద్ధి చేశామనీ, ఇక్కడ జరిగిన ప్రగతిని ప్రజలు చూడాలని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా జలకళే కనిపిస్తోందనీ, తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. "వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వండి. మీరేసే ఒక్కొక్క ఓటు కేసీఆర్ ను సీఎం చేస్తది. కాంగ్రెస్, బీజేపీలకు వేస్తే ఆ ఓటు పోయేది గుజరాత్, ఢిల్లీలకు.. మళ్లీ వాళ్ల గులాంగిరికీ పోతది అంటూ విమర్శించారు.
గత తొమ్మిదిన్నర ఏండ్లలో ఎంతో ప్రగతి సాధించామని పేర్కొన్న మంత్రి కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌లను గెలిపిస్తే రాష్ట్రం 50 ఏండ్లు వెనక్కి వెళ్తుందని హెచ్చరించారు. కరీంనగర్‌లో పోటీ చేస్తే ఏమవుతుందో బీజేపీ-కాంగ్రెస్ నేతలకు తెలుసనని అందుకే, గంగుల కమలాకర్‌పై పోటీ అంటేనే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇదిలావుండగా, ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బిక్కాజిపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తిని శిక్షించి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రవళిక తల్లి మర్రి విజయ, తండ్రి మర్రి లింగన్న, సోదరుడు మర్రి ప్రణయ్‌లను మంత్రి కలుసుకున్నారు. శివరాం వేధింపుల వల్లే ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడిందనీ, అందుకు కారణమైన వ్యక్తికి మరణశిక్ష విధించాలని కుటుంబ సభ్యులు మంత్రి కోరారు. కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని, ప్రవళిక సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుందని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.