పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డు పడ్డారు:జడ్చర్ల సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

By narsimha lode  |  First Published Oct 18, 2023, 5:26 PM IST

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే  పాలమూరు జిల్లా పాలు కారే జిల్లాగా మారనుందని  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు


జడ్చర్ల:పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే మహబూబ్ నగర్ జిల్లా శాశ్వతంగా కరువుకు దూరం కానుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.బుధవారంనాడు  జడ్చర్లలో  నిర్వహించిన  ప్రజా ఆశీర్వాద సభలో  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఏదుల, ఒట్టెం, నార్లాపూర్, కర్వెన, ఉద్దండపూర్  రిజర్వాయర్లు పూర్తి చేస్తుకున్నామన్నారు. రానున్న మూడు నాలుగునెలల్లో  ఈ రిజర్వాయర్లలో కృష్ణా జలాలను నింపుతామని  కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాజెక్టు పరిధిలో లక్షన్నర ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు  ఇదే జిల్లాకు చెందిన నేతలు అడ్డుపడ్డారని ఆయన విమర్శించారు.ఈ ప్రాజెక్టు పూర్తైతే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలకు పేరొస్తుందని  ఆ నేతలు కోర్టుల్లో కేసులు వేశారని కేసీఆర్ మండిపడ్డారు. తొమ్మిదేళ్ల పోరాటం తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించుకున్నామన్నారు.   న్యాయం గెలుస్తుంది.. అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నుండి అనుమతులు వస్తున్నాయని  ఆయన పేర్కొన్నారు.

Latest Videos

కృష్ణా జలాల్లో మన హక్కు సాధించడం కోసం ఎంతో పోరాటం చేశామని కేసీఆర్ చెప్పారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుండి జలాలు తీసుకోవాలని కొందరు చెప్పారన్నారు. 9 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల నుండి నీరు తీసుకొంటే మనకు నీళ్లు సరిపోతాయా అని  కేసీఆర్ ప్రశ్నించారు.

మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని తనకు  జయశంకర్ సూచించారన్నారు. జయశంకర్ సూచన మేరకు తాను  మహబూబ్ నగర్ నుండి ఎంపీగా  పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ తిరిగినా  తనకు దు:ఖం వచ్చేదన్నారు.తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే  తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కొందరు పాలకులు  పాలమూరును దత్తత తీసుకున్నా ఏమీ చేయలేదని  కేసీఆర్ పరోక్షంగా చంద్రబాబుపై  విమర్శలు చేశారు.

కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు ఇబ్బంది పడ్డామన్నారు.ఉన్న తెలంగాణను పోగోట్టింది కాంగ్రెసేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ఎవరూ ఇవ్వలేదన్నారు. పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని  కేసీఆర్ చెప్పారు.చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినట్టుగా కేసీఆర్  గుర్తు చేశారు.

పోలేపల్లి సెజ్  విషయంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని  స్థానిక ప్రజలు అపార్థం చేసుకున్నారన్నారు. జడ్చర్లను  పారిశ్రామికంగా అభివృద్ది చేసుకుంటామని కేసీఆర్ చెప్పారు.గతంలో దుంధుభి నది దుమ్ము కొట్టుకుపోయి ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం దుంధుభి నది నీటితో కలకలలాడుతుందన్నారు.కులం, మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుబంధు పథకంతో  రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్నారు.

కర్ణాటకలో  ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో 20 గంటల పాటు  విద్యుత్ ను రైతులకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గంటల పాటు  విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. తెలంగాణలో రైతులకు  మూడు గంటల విద్యుత్ సరిపోతుందని  కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు  మూడుగంటల కంటే ఎక్కువ విద్యుత్ రాదన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతారని కేసీఆర్  చెప్పారు.

click me!