Bhatti Vikramarka Vs KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ‘గృహ జ్యోతి’ పథకం కింద ఉచిత విద్యుత్‌ను అందించే వరకు ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సూచించారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు.
Bhatti Vikramarka Vs KTR: హైదరాబాద్ వాసులకు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చేసిన వ్యాఖ్యను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. శనివారం నాడు సచివాలయంలో ఆయన మాట్లాడుతూ .. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. విధ్వంసకర బుద్ధి ఉన్న వారే ఇలాంటి ప్రకటనలు చేస్తారనీ, రాష్ట్రం అంధకారంలో ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖను అప్పులపాలు చేసి.. ఇప్పుడు బిల్లులు కట్టవద్దని ప్రజలను కోరుతున్నారని మండిపడ్డారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు.
ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..
ఇంటింటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వాగ్దానాలలో ఈ పథకం ఒకటి. జనవరి నెల కరెంట్ బిల్లులు ఎవరు కట్టొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు . హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలంతా కరెంట్ బిల్లులను సోనియా గాంధీ (sonia Gandhi) ఇంటికి,10 జన్‌పథ్‌కు పంపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు నెలకు రూ.2500 వెంటనే ఇవ్వాలని, కాంగ్రెస్ ఎన్నిక వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే వదలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు.కాంగ్రెస్ 50 రోజుల పాలనలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి.. మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండేగా మారతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రక్తం అంత బిజెపిదే… ఆయన చోటా మోడీగా మారడని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు విలీనానికి ప్లాన్ చేస్తున్నాయని కెటి రామారావు ఆరోపించారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడని విమర్శించారు. 100 రోజుల్లో హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టకుండా, అదానీతో రేవంత్ వివాదాస్పద లావాదేవీలకు పాల్పడ్డారని కేటీఆర్ అన్నారు.