Telangana Crime : కేవలం వెయ్యి రూపాయల కోసం స్నేహితుడి దారుణ హత్య

Arun Kumar P   | Asianet News
Published : May 08, 2022, 09:59 AM IST
Telangana Crime : కేవలం వెయ్యి రూపాయల కోసం స్నేహితుడి దారుణ హత్య

సారాంశం

పదికి, పాతికకి హత్యలు చేయడం సినిమాల్లో చూస్తుంటాం... కానీ కేవలం వెయ్యి రూపాయల కోసం స్నేహితున్ని అతి కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ జిల్లాలో నిజంగా  జరిగింది. 

మెదక్: మానవ సంబంధాలే కాదు స్నేహాలు కూడా ఆర్థిక సంబంధాలేనని మెదక్ జిల్లాలో జరిగిన దారుణ హత్య మరోసారి నిరూపించింది. కేవలం వెయ్యి రూపాయల కోసం స్నేహితున్ని బండరాయితో మోది అతి కిరాతకంగా చంపాడో కసాయి. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.   

మెదక్ జిల్లా (medak district) కౌడిపల్లి మండలంలోని తునికి అటవీ ప్రాంతంతో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు మాలోతు సురేష్ (32) గా పోలీసులు గుర్తించారు. సంఘటనాస్థలంలో ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అయితే సురేష్ ని హతమార్చిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేసి మరోసారి ఆధారాలను సేకరించేందుకు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి కాట్రోజు శ్రీను అనే వ్యక్తి కూడా ఘటనాస్థలం వద్దకు వెళ్లి పోలీసులను రహస్యంగా గమనిస్తూ అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారించగా సురేష్ ను తానే హత్య చేసినట్లు బయటపెట్టాడు.  

తన స్నేహితుడు సురేష్ ను హత్య చేసేందుకు దారితీసిన సంఘటన గురించి శ్రీను పోలీసులకు వివరించాడు. చిల్‌పచేడ్‌ మండలంలోని అంతారం చెరువుకొమ్ము తండాకు చెందిన శ్రీనుకు సురేష్ స్నేహం వుంది. ఈ క్రమంలోనే శ్రీను వద్ద అవసరాల కోసం సురేష్ వెయ్యి రూపాయిలు అప్పుగా తీసుకున్నాడు. కాని తిరిగి ఇస్తానన్న గడువు మించిపోవడంతో పలుమార్లు సురేష్ కు శ్రీను ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏవో కారణాలు చెబుతూ సురేష్ డబ్బులు తిరిగివ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అతడిపై శ్రీను కోపంతో రగిలిపోయాడు. 

ఈ క్రమంలోనే మే 2వ తేదీన సురేష్ స్వగ్రామానికి వెళుతూ ఓ వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా శ్రీను కలిసాడు. ఇద్దరు బాగానే మాట్లాడుకుని కలిసి మద్యం సేవిద్దామని నిర్ణయించుకున్నారు. దీంతో మద్యం కొనుగోలు చేసి సమీపంలోని తునికి అటవీ ప్రాంతంలోకి ద్విచక్రవాహనంపై వెళ్లారు. అయితే మద్యం సేవించిన తర్వాత వెయ్యి రూపాయల విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.  

అప్పటికే సురేష్ పై కోపంతో వున్న శ్రీను క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టాడు. పెద్ద బండరాయిని తీసుకుని సురేష్ తలపై వేయగా అక్కడికక్కడే మరణించాడు. దీంతో శ్రీను అక్కడినుండి పరారయ్యాడు. కానీ ఎక్కడ పోలీసుల దర్యాప్తులో తానే హత్య చేసినట్లు బయటపడుతుందని భయపడిపోయాడు. అదే భయంలో మరోసారి సంఘటనా స్థలానికి వెళ్లి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. శ్రీనును పట్టుకుని విచారించగా వెయ్యి రూపాయిల కోసమే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 

చాకచక్యంగా వ్యవహరించి ఈ హత్య కేసును ఛేదించిన ఏఎఎస్సై శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ భాగయ్య, సురేష్ లను నర్సాపూర్‌ సీఐ షేక్‌లాల్‌ మదర్‌, కౌడిపల్లి ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి అభినందించారు. నిందితుడికి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. 


 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu