
హైదరాబాద్ : యువతులు, వితంతువులే టార్గెట్ గా ఘరానామోసాలకు పాల్పడుతున్న ఓ కంత్రీగాడు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. కేవలం సోషల్ మీడియా వేదికలనే పెట్టుబడిగా వాడుకుని ఏకంగా 500మంది మహిళల్ని వంచించాడు ఈ ఘరానా మోసగాడు. ఇప్పటివరకు ఇతగాడు మహిళల నుండి ఏకంగా 3.5కోట్లు వసూలు చేసి క్రికెట్ బెట్టింగ్, గుర్రపు పందాల పేరిట జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే... ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ(31) బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం 2014లో హైదరాబాద్ వచ్చాడు. ఆంధ్రాకు చెందినవారు ఎక్కువగా నివాసముండే కూకట్ పల్లిలో నివాసముంటూ కొన్నాళ్లు వైబ్స్ హోటల్లో పనిచేసాడు. ఈ సమయంలోనే క్రికెట్ బెట్టింగ్, గుర్రపు పందాలు వంటి జల్సాలకు అలవాటుపడ్డాడు. అయితే చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ అతడు నెలజీతం సరిపోక అమ్మాయిలను మోసగించి ఈజీగా మనీ సంపాదించాలని నిర్ణయించాడు.
హోటల్లో ఉద్యోగం మానేసి ఓ ట్రావెల్ కన్సల్టెన్సీలో చేరాడు. అక్కడికి వచ్చే యువతులతో పరిచయం పెంచుకుని పెద్ద పెద్ద సాప్ట్ వేర్ కంపనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. ఇలా మాయమాటలు చెప్పి చాలామంది యువతులను మోసగించాడు. ఇతడి చేతిలో మోసపోయిన యువతులు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గతంలో వంశీకృష్ణ కటకటాలపాలయ్యాడు.
అయితే జైలునుండి బయటకు వచ్చాక వంశీకృష్ణ మోసాలు చేయడంలో మరింత రాటుదేలిపోయాడు. ఈసారి నేరుగా కాకుండా సోషల్ మీడియా వేదికల ద్వారా అమ్మాయిల మోసాలకు తెరతీసాడు. అమ్మాయిలు, సంపన్న యువకుడిలా సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేసి మహిళల్ని మోసగించడం ప్రారంభించాడు.
మొదట సోషల్ మీడియా మాద్యమాల్లో ఈజీగా తన వలలో పడే మహిళలను ఎంపిక చేసుకునేవాడు. యువతి పేరుతో వున్న నకిలీ ఖాతా నుండి చాట్ చేస్తూ మెళ్లిగా వ్యక్తిగత వివరాలు సేకరించేవాడు. సదరు మహిళ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత హర్ష, హర్షవర్దన్ పేరిట సంపన్నుడిగ సేవా కార్యక్రమాలు చేయిస్తానని, ఉపాధి అవకాశాల ఇప్పిస్తానంటూ పరిచయం పెంచుకునేవాడు. మొదట వారికి నమ్మకం కలిగేలా లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో జమచేసేవాడు.
భారీగా డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడేసరికి మహిళలు కూడా అతడు నిజంగానే బాగా సంపన్నుడని నమ్మేవారు. ఈ నమ్మకాన్ని సంపాదించిన తర్వాత అసలు మోసానికి తెరతీసేవాడు. తన బ్యాంకు ఖాతాలు నిలిపివేసారని... కొంత డబ్బు అవసరం వుంది సర్దాలంటూ కోరేవాడు. ఇలా అందినకాడికి డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత ఫోన్ నెంబర్ స్విచ్చాప్ చేసుకోవడం, సోషల్ మీడియా ఖాతాను కూడా బ్లాక్ చేసేవాడు. అలాగే వితంతువులను పెళ్లి పేరిట నమ్మించి మోసం చేసేవాడు. ఇలా 2016 నుండి ఇప్పటివరకు దాదాపు 500మంది మహిళలను ఇతడు మోసం చేసినట్లు సమాచారం.
భాదితుల్లో 50-60మంది మాత్రమే తమకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిగతావారు పరువు పోతుందనో, ఇతరత్రా కారణాలతో బయటకు రాలేదు. అయితే సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని వంశీకృష్ణను అరెస్ట్ చేసారు.