వచ్చే లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీనే కాదు.. కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టింది. కీలక నేతలంతా అసెంబ్లీ బరిలో నిలబడ్డాక.. పార్లమెంటు స్థానాల్లో ఎవరినెవరిని బరిలోకి దింపుదామా? అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. అసెంబ్లీ బరిలో ఓడినా.. కొంతకాలం క్యాబినెట్‌లోకి తీసుకుని మళ్లీ ప్రజల ముందు లోక్ సభ బరిలో ఉంచాలనే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ జోరును లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగించాలని యోచిస్తున్నది. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నా.. అవి పరోక్షంగా బీజేపీకి మద్దతుగానే నిలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఏపీలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. తెలంగాణలో మాత్రం తొలిసారి అధికార పీఠాన్ని అధిరోహించింది. ఇక్కడ ఎన్ని సీట్లు గెలిచినా.. అది కాంగ్రెస్ పార్టీకి అదనంగా కలిసొచ్చేవే. ఎందుకంటే.. ఇది వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా తొలుత బీజేపీకి అనుకూలంగా నడుచుకున్నదే. కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే లోక్ సభ టార్గెట్‌గా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ప్రతి రోజూ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆయన తన నిర్ణయాలతో ప్రజల్లో కాంగ్రెస్ ఆదరణను రెట్టింపు చేస్తున్నది. తాము కాంగ్రెస్ నమ్మడం మంచిదే అయింది అనే అభిప్రాయాన్ని మెల్లిగా తీసుకెళ్లుతున్నారు. ఇదే అభిప్రాయం లోక్ సభలోనూ పని చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది.
లోక్ సభపై దృష్టి పెడుతున్న కాంగ్రెస్.. పార్లమెంటు బరిలో ముగ్గురు కాంగ్రెస్ నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. తుంగతుర్తి నుంచి కచ్చితంగా అద్దంకి దయాకర్‌కే టికెట్ దక్కుతుందని చాలా మంది.. కాంగ్రెస్సేతరులు కూడా ఊహించారు. కానీ, అక్కడి సామాజిక పరిస్థితుల దృష్ట్యా సామేల్‌కు టికెట్ ఇచ్చింది. అయితే, ఆయన ఆదరణను దృష్టిలో పెట్టుకుని వరంగల్ పార్లమెంటు బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనికంటే ముందు ఆయన ప్రజల నాలుకలపై నానడానికి క్యాబినెట్‌లోకి అద్దంకి దయాకర్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read:
అద్దంకి దయాకర్‌తోపాటు మైనంపల్లి హన్మంతరావు, ఫిరోజ్ ఖాన్‌లను కూడా మంత్రివర్గంలోకి తీసుకుని ప్రజాదరణ పెంచుకునేలా చేసి ఆ తర్వాత లోక్ సభ నుంచి పోటీ చేయించాలనే ఆలోచలు చేస్తున్నది. ఆ తర్వాత హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఫిరోజ్ ఖాన్‌ను, మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటు పై మైనంపల్లిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: YCP: ఎన్నికల ముంగిట్లో వైసీపీకి దెబ్బ.. టీడీపీలోకి జగన్ ఎమ్మెల్యేలు
తెలంగాణలో మెజార్టీ మార్క్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఎంపీలుగా రాజీనామా చేసి మరీ అసెంబ్లీ బరిలోకి ముగ్గురు నేతలు దిగారు. కానీ, ఎంపీ సీట్ల కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లేవు. కాబట్టి, ఇలాంటి నేతలను షైన్ చేసి రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డినే ఇంకా టీపీసీసీ చీఫ్‌గా ఉన్నారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలలో ఆయన పాత్ర కూడా కీలకమే కానుంది.