రూ. 500లకే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్: రేవంత్ సర్కార్‌కు భారమేనా?

By narsimha lode  |  First Published Dec 15, 2023, 10:27 PM IST


రూ. 500లకే ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ ను అందించే పథకంపై  రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తును ప్రారంభించింది. 



హైదరాబాద్: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  రూ. 500లకే  ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో  రూ. 500లకే  ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ హామీ కూడ ఉంది.

రూ. 500లకే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్  పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై  తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. మూడు రోజుల క్రితం పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

Latest Videos

undefined

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  వంద రోజుల్లో అమలు చేస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ప్రకటించారు. రూ.500లకే ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ పథకం అమలు విషయమై  అధికారులు కసరత్తును ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లున్నాయి.  హెచ్ పీసీఎల్  43,39,354,  ఐఓసీఎల్  47,96,302, బీపీసీఎల్  నుండి 29,04,338 మంది వినియోగదారులున్నారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులున్నారు. రాష్ట్రంలోని 1.20 కోట్ల గ్యాస్ వినియోగదారుల్లో  44 శాతం మంది  ప్రతి నెలా రీఫిల్ చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం  ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 955. అయితే  ప్రభుత్వం రూ. 40 సబ్సీడీని ఇస్తుంది.  ఉజ్వల్ పథకం కింద గ్యాస్ వినియోగదారులకు రూ. 340 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే  4.2 లక్షల మంది వినియోగదారులు సబ్సిడీని వదులుకున్నారు. 

రూ. 500లకే  ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తే  రూ. 4,450 కోట్ల భారం పడనుంది. అయితే  రూ. 500లకే  ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.ఈ మేరకు మార్గదర్శకాలను తయారు చేయనుంది. 

తెల్ల రేషన్ కార్డుదారుల్లో అనర్హులు కూడ లేకపోలేదు.  తెల్ల రేషన్ కార్డుదారుల్లో  నిజమైన లబ్దిదారులకే  ఈ పథకాన్ని వర్తింపజేస్తారా, అందరికీ ఈ పథకం వర్తింపచేస్తారా అనే విషయం రానున్న రోజుల్లో తేలనుంది. 

రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడ అధికంగానే ఉంది.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే  అదనంగా నిధులను సమకూర్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.ఈ తరుణంలో  కాంగ్రెస్ సర్కార్ రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎలా అమలు చేయనుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

click me!