అయోధ్య రామయ్యకు మేడారం సమ్మక్కతో చెక్ ... తెలంగాణ కాంగ్రెస్ భారీ స్కెచ్ 

By Arun Kumar P  |  First Published Jan 31, 2024, 2:50 PM IST

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు భారీ ఆద్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. 


హైదరాబాద్ : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని బిజెపి రాజకీయాల కోసం వాడుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసమే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చేస్తున్నారంటూ ఆలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా వుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా అయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ కూడా బిజెపి రాజకీయాల్లో భాగమేనని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి ఆద్యాత్మిక కార్యక్రమాన్నే చేపట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్దమవుతోంది.  

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో పార్టీ ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల కోసం ఎలా సిద్దం కావాలి... ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అన్నదానిపై రేవంత్ చర్చించారు. ఎంపీ అభ్యర్ధుల ఎంపికపైనా చర్చించి ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు. 

Latest Videos

ఈ సందర్భంగా అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గడపకు అక్షింతలు పంచిన విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేసారు. ఇలాగే త్వరలో జరగనున్న  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు బంగారంగా భావించే బెల్లంతో పాటు అమ్మవారి పసుపు, కుంకుమలను  పంపిణీ చేయాలని మంత్రి ప్రతిపాదించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీచేయడం ద్వారా    హిందువులకు దగ్గర కావొచ్చన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనగా అర్థమవుతోంది. 

Also Read  తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో సోనియా గాంధీ .. తెరపైకి కొత్త డిమాండ్ , ‘‘ సెంటిమెంట్‌ ’’తో రేవంత్ రాజకీయం

సమ్మక్క-సారలమ్మల బెల్లం ప్రసాదాన్ని, పసుపు కుంకుమను పంచే బాధ్యతను కాంగ్రెస్ శ్రేణులకే అప్పగించాలని సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీ ఎమ్మెల్యేలు కేడర్ ను కలుపుకుపోతూ పంపిణీ చేపట్టేలా చూడాలని సభ్యుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం.

click me!