తాగిన మైకంలో ఆర్టిసి బస్సు ఎక్కిన మహిళ కండక్టర్ ను బూతులు తిడుతూ దాాడికి యత్నించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : టీఎస్ ఆర్టిసి సిబ్బందితో ఓ యువతి అత్యంత దారుణంగా ప్రవర్తించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బస్సెక్కిన యువతి కండక్టర్ ను నోటికొచ్చినట్లు బూతులు తిట్టడమే కాదు కాలితో తంతూ దాడికి యత్నించింది. అంతటితో ఆగకుండా కండక్టర్ పై ఉమ్మివేసి అవమమానకరంగా వ్యవహరించింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా, ఓ మహిళా కండక్టర్ అడ్డుకున్నా వినకుండా కండక్టర్ పైపైకి వెళుతూ నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.
హయత్ నగర్ డిపోకు చెందిన ఆర్టిసి బస్సులో ఓ మహిళ మద్యం మత్తులో ఎక్కింది. ఆమె వద్ద ఎలాంటి దృవపత్రాలు లేకపోవడంతో టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరాడు. దీంతో ఆమె 500 రూపాయల నోటు ఇవ్వగా చిల్లర లేవని కండక్టర్ తెలిపాడు. ఆమె కూడా తన దగ్గర ఇవే వున్నాయని చెప్పింది. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం జరగ్గా బస్సు దిగిి వెళ్లిపోవాలని కండక్టర్ సూచించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన ఆమె కండక్టర్ తో గొడవకు దిగింది. అతడిని అమ్మనాబూతులు తిడుతూ దాడికి యత్నించింది.
కండక్టర్ తో పాటు తోటి సిబ్బంది కూడా సముదాయిస్తున్నా వినకుండా బూతులతో రెచ్చిపోయింది. మహిళ అన్న గౌరవంతో ఆమె తిడుతున్నా కండక్టర్ ఏమీ అనలేదు.... దీంతో యువతి మరింత రెచ్చిపోయింది. ఇలా కండక్టర్ ను యువతి బూతులు తిడుతూ దాడికి యత్నించడాన్ని బస్సులోని ప్రయాణికులు కొందరు వీడియో తీసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు మహిళపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఒకేసారి 86 మంది బదిలీ:హైద్రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలనం
తెలంగాణ ఆర్టిసి ఎండీ విసి సజ్జనార్ దృష్టికి కూడా ఈ వీడియో వెళ్ళింది. ఆ యువతి తీరుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సీరియస్ అయ్యారు సజ్జనార్. ''హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు'' అని సజ్జనార్ తెలిపారు.
''మొదటి ట్రిప్పుని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించిన ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది'' అంటూ సదరు మహిళకు హెచ్చరించడంతో పాటు ప్రయాణికులకు కీలక సూచనలు చేసారు విసి సజ్జనార్.