పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాల్సిందే: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ సింగ్ వార్నింగ్

By narsimha lodeFirst Published Dec 23, 2022, 11:35 AM IST
Highlights

పార్టీ నేతలంతా  కలిసి కట్టుగా  పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  దిగ్విజయ్ సింగ్ ఆ పార్టీ నేతలను కోరారు. ఏ విషయాలనైనా  అంతర్గతంగానే చర్చించుకోవాలని  దిగ్విజయ్ సింగ్  సూచించారు. 

హైదరాబాద్:పార్టీలో  విభేదాలపై  నేతలెవరూ కూడా బహిరంగంగా మాట్లాడొద్దని  దిగ్విజయ్ సింగ్  హెచ్చరించారు. త్వరలోనే అన్నీ సమస్యలు పరిష్కారం కానున్నాయని  ఆయన  అభిప్రాయపడ్డారు.
శుక్రవారం నాడు గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్  మీడియాతో మాట్లాడారు. 

కలిసికట్టుగా  ఉంటేనే ప్రత్యర్ధుల్ని ఓడించగలమన్నారు. పార్టీలైన్ కు కాంగ్రెస్ నేతలు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. సమస్యలేవైనా ఉంటే అంతర్గతంగా  చర్చించుకోవాలని  పార్టీ నేతలకు  దిగ్విజయ్ సింగ్  హితవు పలికారు.  ఏ సమస్యపైనైనా అంతర్గతంగా  చర్చించాలని పార్టీ నేతలకు చేతులు జోడించి కోరుతున్నానని  దిగ్విజయ్ సింగ్  చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని  ఆయన చెప్పారు.దీన్ని సద్వినియోగం చేసుకోవాలని  కాంగ్రెస్ పార్టీ నేతలకు  ఆయన  సూచించారు. తెలంగాణలో సీనియర్ నేతలంతా  సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని  దిగ్విజయ్  చెప్పారు. కాంగ్రెస్ లో  సీనియర్లు, జూనియర్లు అనే ప్రస్తావన సరికాదన్నారు.పీసీసీ చీఫ్,  ఇంచార్జీ మార్పు తన పరిధిలోని అంశం కాదని  ఆయన తేల్చి చెప్పారు.

also read:గాంధీభవన్‌లో మరో గొడవ .. అనిల్ ఎపిసోడ్ సర్దుమణిగేలోగా, బలరాంనాయక్‌తో మహబూబాబాద్ నేతల వాగ్వాదం

రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు  ప్రజల నుండి అపూర్వ స్పందన  లభిస్తుందని ఆయన చెప్పారు. అయతే ఈ యాత్రను  అడ్డుకొనేందుకు  బీజేపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ పాలనలో  మద్య, దిగువ తరగతి ప్రజలు చితికిపోతున్నారన్నారు.   ఈడీ, ఐటీ,సీబీఐ దాడులతో  నిర్ధోషులను  బీజేపీ సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని  ఆయన ఆరోపించారు.  చార్జీషీట్లు దాఖలు చేయకుండా  బెయిల్ రాకుండా  చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ప్రత్యర్ధి పార్టీల నేతలపై  తప్పుడు కేసుల్లో ఇరికించి  రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు  మోడీ సర్కార్  ప్రయత్నాలు చేస్తుందన్నారు. 

మోడీ సర్కార్  అధికారంలోకి వచ్చిన నాటి నుండి  దేశంలో  నిరుద్యోగం, ధరలు  విపరీతంగా  పెరిగిపోయాయన్నారు.మోడీ విధానాలతో  సంపన్నులకే ప్రయోజనం కలుగుతుందన్నారు.  ఇంతలా  నిరుద్యోగం, ధరల పెరుగుదల ఏనాడూ తాను చూడలేదని  దిగ్విజయ్ సింగ్  చెప్పారు.

ఇద్దరు ఎంపీలే  తెలంగాణను సాధించారా అని  కేసీఆర్ ను ప్రశ్నించారు దిగ్విజయ్ సింగ్ . కాంగ్రెస్ మద్దతు లేకపోతే తెలగాణ వచ్చేది కాదన్నారు దిగ్విజయ్ సింగ్ . 2004లో తెలంగాణ ఇస్తామని  ఇచ్చిన మాటను  2014లో తాము అమలు చేసిన విషయాన్ని దిగ్విజయ్ సింగ్  గుర్తు చేశారు.  తెలంగాణ ఏర్పడ్డాక  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా  కేసీఆర్ ప్రచారం చేశారన్నారు. ఇంతకంటే  కృతఘ్నత  ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.  తమ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి బీఆర్ఎస్ లో చేర్పించుకున్నారని ఆయన గుర్తు చేశారు. 

 ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలను కేసీఆర్  విస్మరించారని  ఆయన విమర్శించారు.తెలంగాణలో కేసీఆర్  కుటుంబ పాలన సాగుతుందని  ఆయన చెప్పారు. అవినీతిలో  కేసీఆర్ సర్కార్ రికార్డు బద్దలు కొడుతుందన్నారు.  బీజేపీని గెలిపించడానికి  బలం లేని స్థానాల్లో   బీఆర్ఎస్ పోటీ చేస్తుందని  దిగ్విజయ్ సింగ్  ఆరోపించారు. బీజేపీ ప్రతి నిర్ణయానికి బీఆర్ఎస్ మద్దతు పలికిందని ఆయన ఈ సందర్భంగా  ప్రస్తావించారు. 

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్  చేశారు.  ఇప్పుడు  బీఆర్ఎస్ తో పనేంటని ఆయన ప్రశ్నించారు. మైనారిటీ  రిజర్వేషన్లపై  కేసీఆర్ హామీని ఓవైసీ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అడిగారు.  బీఆర్ఎస్ పై పోరాటానికి కాంగ్రెస్ నేతలంతా  సిద్దం కావాల్సిందిగా  ఆయన కోరారు.


 

click me!