టీ.కాంగ్రెస్‌లో ‘‘కోమటిరెడ్డి’’ కలకలం.. ఎల్లుండి హైదరాబాద్‌కి ఠాగూర్, సీనియర్లతో భేటీ అయ్యే ఛాన్స్..?

By Siva KodatiFirst Published Aug 14, 2022, 2:43 PM IST
Highlights

గత కొన్నిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాగూర్ ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్నారు. 
 

గత కొన్నిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోన్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి బ్రదర్స్ (komatireddy brothers) ఎపిసోడ్‌తో పాటు దాసోజు శ్రవణ్ పార్టీని వీడటం, త్వరలో మునుగోడు ఉపఎన్నిక (munugode bypoll) నేపథ్యంలో కాంగ్రెస్ (congress) అధిష్టానం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాగూర్ ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (revanth reddy) వ్యతిరేకంగా కొందరు నేతలు గళం విప్పుతుండటం, త్వరలో చేరికలుంటాయని బీజేపీ నేతలు బహిరంగంగా చెబుతూ వుండటంతో  టీకాంగ్రెస్‌లో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలోనే పరిస్ధితిని చక్కదిద్దేందుకు ఠాగూర్‌ని పంపుతోంది కాంగ్రెస్ హైకమాండ్. 

మరోవైపు.. ఠాగూర్ వ్యవహారశైలిపైనా పార్టీలో అసంతృప్తి గూడుకట్టుకుని వుంది. సీనియర్ల అభిప్రాయాలు, సలహాలను పట్టించుకోకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలంగా వుంటున్నారని ఆయనపై నేతలు భగ్గుమంటున్నారు. దాసోజు శ్రవణ్ కూడా వెళ్తూ వెళ్తూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఠాగూర్ తీరుతో చాలామంది నేతలు పార్టీని వీడిపోయే అవకాశాలు వున్నాయని.. వెంటనే ఆయన్ని తొలగించాలంటూ కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. దీంతో త్వరలోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఠాగూర్ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన సచిన్ పైలట్ సహా మరికొందరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Also read: రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలు.. మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్రకు దూరం..!

ఇకపోతే.. రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయన కరోనా పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. వైద్య సిబ్బంది ఇప్పటికే శాంపిల్స్ సేకరించగా.. మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కరోనా లక్షణాల నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరంగా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. 

click me!