ఆదిలాబాద్ జిల్లాలో సైన్ ఫ్లూ కలకలం.. అప్రమత్తమైన వైద్యాధికారులు..

By Sumanth KanukulaFirst Published Aug 14, 2022, 12:49 PM IST
Highlights

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైన్ ఫ్లూ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. 

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైన్ ఫ్లూ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళకు స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో ఆమెను రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు.. వంటి లక్షణాలతో రిమ్స్‌లో చేరింది.

అయితే మూడు రోజులు గడిచిన జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు.. మహిళ నుంచి నమునాలు సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. అయితే ఆ పరీక్షల్లో మహిళకు స్వైన్ ఫ్లూగా నిర్దారణ అయింది. దీంతో ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
 
ఇక, ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చాలా పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. ఈ క్రమంలోనే చాలా గ్రామాలు, పట్టణాలలలో వైరల్ ఫీవర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సక్రమంగా క్లోరినేషన్‌ చేసి చెత్తకుప్పలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పలు గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే పారిశుధ్య సమస్య కారణంగా వైరల్‌ జ్వరాలు విభృంభిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు.
 

click me!