Munugode Bypoll 2022: మునుగోడులో వాటిపైన చర్చ జరగాలి: కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి వీడియో సందేశం

By Sumanth KanukulaFirst Published Aug 14, 2022, 2:13 PM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై పడుతున్న భారంపై చర్చ జరగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మనుగోడు ఉపఎన్నికను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై పడుతున్న భారంపై చర్చ జరగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మనుగోడు ఉపఎన్నికను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ సమస్యల ప్రతిపాదికన జరగాల్సిన చర్చ కాస్తా.. వ్యక్తిగతమైన విమర్శలు, పరుష పదజాలంపై చర్చ జరుగుతుందన్నారు. దీనివల్ల తెలంగాణ సమాజానికి, మునుగోడు ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, పెరిగిన నిత్యావసర ధరలపై చర్చ జరగాలని అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. 

8 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయాల వల్ల.. పేదలపై పడిన భారం గురించి చర్చ జరగాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై భారం వేసి.. బతకడమే కష్టంగా మార్చిందని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ పాలనలో పేదలు, నిరుద్యోగులు, రైతులు.. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఓట్లు అడగాలంటే.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పరిష్కరించడానికి వారి ప్రణాళికలను చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గానికి కేంద్రంలోని బీజేపీ రూ. 5 వేల కోట్లు ప్రకటించి.. అక్కడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ పని చేసి బీజేపీ ఓట్లు అడిగితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. 

2014 నుంచి కేసీఆర్ చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మళ్లీ మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు... ఏ హామీని కూడా కేసీఆర పూర్తి చేయలేదని విమర్శించారు.  ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.  మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు వివాదాల జోలికి వెళ్లకుండా.. ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు. కమ్యూనిస్టులు, కోదండరాం మద్దతు కోరతామని చెప్పారు. 

 

మన మునుగోడు ...మన కాంగ్రెస్
2/2 pic.twitter.com/jVyesBtHCi

— Revanth Reddy (@revanth_anumula)

ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. తేలికపాటి ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న తాను కోవిడ్ పరీక్షలు చేయించుకున్నానని.. అందులో పాజిటివ్‌గా నిర్దారణ అయిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన రిపోర్టును కూడా రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. గత కొన్ని రోజులుగా తనను సంప్రందించిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 

click me!