Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ .. ఆర్థిక, రక్షణ మంత్రులతో భేటీ

By Rajesh Karampoori  |  First Published Jan 6, 2024, 3:36 AM IST

Revanth Reddy: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని అభ్యర్థించారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణకు ఏటా రూ.450 కోట్లు రావాల్సి ఉండగా.. గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా కేంద్రం నిధులు విడుదల చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణకు రూ.1800 కోట్లు విడుదల చేయాలని ఆయన కోరారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణకు ఏటా రూ.450 కోట్లు రావాల్సి ఉండగా గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా కేంద్రం నిధులు విడుదల చేయలేదని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రూ.2,233.54 కోట్లు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి వచ్చిన ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.

Latest Videos

అంతకు ముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల అభివృద్ధికి రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని రేవంత్‌రెడ్డి కోరారు. మెహదీపట్నం వద్ద ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు స్కైవాక్‌ నిర్మాణానికి 0.21 హెక్టార్ల రక్షణ భూమిని బదలాయించేలా ఆదేశించాలని రక్షణ మంత్రిని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనపై రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

హైదరాబాద్‌ను రాజీవ్ రహదారి (కరీంనగర్-రామగుండం రహదారి)కి కలిపేలా 11.30 కి.మీ పొడవునా ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి 83 ఎకరాల భూమిని బదిలీ చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. అదేవిధంగా.. ప్యారడైజ్ జంక్షన్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 12.68 కి.మీ పొడవునా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 56 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రిని కోరారు. 

గురువారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు బిజీబిజీగా గ‌డిపారు. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను, UPSC చైర్మన్ తో భేటీ అయ్యారు.  తొలి రోజు రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్ప‌న కోసం జ‌ల్‌ శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌ను, హైద‌రాబాద్ మెట్రో విస్త‌ర‌ణ‌, మూసీ రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధి, ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు కోసం కేంద్ర గృహ‌నిర్మాణం, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి హ‌ర్‌దీప్‌ సింగ్ పురీతో భేటీ అయ్యారు. 

రెండో రోజు (శుక్ర‌వారం) యూపీఎస్సీ ఛైర్మ‌న్, కార్య‌ద‌ర్శిల‌తో సుదీర్ఘంగా భేటీ అయి టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న అంశంపై చ‌ర్చించారు. హైద‌రాబాద్‌లో ర‌క్ష‌ణ శాఖ భూముల బ‌ద‌లాయింపుపై ర‌క్ష‌ణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్‌ సింగ్‌తో, తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన నిధుల‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మతి నిర్మ‌లా సీతారామ‌న్‌ను క‌లిసి చ‌ర్చించారు. ముఖ్యమంత్రి న్యూ ఢిల్లీ నుంచి రాత్రి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరారు.

click me!