CM Revanth Reddy: ముగిసిన ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

By Rajesh Karampoori  |  First Published Jan 6, 2024, 3:14 AM IST

CM Revanth Reddy: గురువారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లిన ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు బిజీబిజీగా గ‌డిపారు. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను, UPSC చైర్మన్ తో భేటీ అయ్యారు. 


CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ రెండు రోజులు బిజీబిజీ షెడ్యూల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను, UPSC చైర్మన్ తో భేటీ అయ్యారు. తొలి రోజు రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్ప‌న కోసం జ‌ల్‌ శ‌క్తి మంత్రి గజేంద్ర‌సింగ్ షెకావ‌త్‌ను, హైద‌రాబాద్ మెట్రో విస్త‌ర‌ణ‌, మూసీ రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధి, ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు కోసం కేంద్ర గృహ‌నిర్మాణం, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి హ‌ర్‌దీప్‌ సింగ్ పురీతో భేటీ అయ్యారు.

రెండో రోజు (శుక్ర‌వారం) యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్టర్ మనోజ్ సోనీ, కార్య‌ద‌ర్శిల‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న అంశంపై చ‌ర్చించారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘ కాలంగా అంత సమర్థంగా యూపీఎస్సీ పని చేస్తున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తెలంగాణలో కూడా నూతన ఉద్యోగ నియామక ప్రక్రియలో ఈ విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్న ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై యూపీఎస్సీ చైర్మన్ స్పందించారు. UPSCలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు.

Latest Videos

మధ్యాహ్నం కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లో ర‌క్ష‌ణ శాఖ భూముల బ‌ద‌లాయింపుపై ర‌క్ష‌ణ శాఖ మంత్రితో చర్చించారు. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అక్క డ ఉన్న రక్షణశాఖ భూమినుబ దిలీ చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. అలాగే..  తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.  

అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన నిధుల‌పై చ‌ర్చించారు. వెనకబడిన జిల్లాలకు 18 వందల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. 15 వ ఆర్థికసంఘం నుంచి రావాల్సిన 2 వేల కోట్ల నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఢిల్లీ నుంచి రాత్రి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరారు.

click me!